ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల జాబితా రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మున్సిపల్, మార్కెటింగ్, ఇన్‌స్టిట్యూషన్ కార్పొరేషన్ల కంటే దేవాలయాల పాలక మండళ్లపై ఆశావహుల్లో తీరని ఆకర్షణ కనిపిస్తోంది. అధికారంలో ఉన్న టీడీపీతో పాటు జనసేన, బీజేపీ శ్రేణులు కూడా తమకు చోటు దక్కేలా వరుసగా లాబీ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కండువాలు కప్పినవాళ్లు ఇప్పుడు “మాకేం ఇచ్చారు?” అని ప్రశ్నలు వేస్తున్నారు.
తాజాగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 76 ఆలయాల పునరుద్ధరణకు రూ.143 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీనిపై పనులు వేగంగా కొనసాగుతుండగా, అదే సమయంలో ఆలయాల పాలక మండళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆలయాల అభివృద్ధి, నిర్వహణకు కీలకంగా ఉండే ఈ పాలక మండళ్లలో చోటు కోసం ఎంపీ స్థాయి నేతల నుంచి, గ్రామీణ నాయకుల దాకా అందరూ రంగంలోకి దిగారు. కేవలం పథకాల్లో కాకుండా “దేవుడి సేవ”ను దక్కించుకునేందుకు చేసే ఈ ప్రయత్నాల వెనక రాజకీయ ప్రాధాన్యత అంతుచిక్కదు.
విశాఖ నరసింహ స్వామి, విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం మల్లిఖార్జున, అన్నవరం సత్యనారాయణ స్వామి వంటి ప్రముఖ దేవాలయాల్లో పాలకులుగా ఉండటం.. భక్తులలో గుర్తింపు, సామాజికంగా భద్రత, రాజకీయంగా ఓ ఇమేజ్ అని భావిస్తున్నారు. పైగా ఈ సేవల ద్వారా సమాజంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. అందుకే నియోజకవర్గ స్థాయిలోనూ నేతలు ఒత్తిడి పెంచుతున్నారు.
అయితే మూడురాజకీయ పార్టీల కూటమిలో భాగస్వాముల సంఖ్య అధికంగా ఉండటంతో, ఈ నియామకాల విషయంలో హైకమాండ్ ముందు వడపోత కచ్చితంగా ఉండబోతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆలయాల పేరుతో వచ్చిన పదవులు అయినా, వీటిని పొలిటికల్ ఎక్వేషన్‌లో భాగంగా బేట చేయాలన్నది చర్చనీయాంశంగా మారింది.