గత కొన్నిరోజులుగా మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోతారని విస్తృత ప్రచారం జరుగుతోంది. పార్టీ కీలక నేత, మోస్ట్ సీనియర్ కామ్రేడ్ లక్ష్మణ్ రావ్ అలియాస్ గణపతి పోలీసులకు లొంగిపోయే పనిలో ఉన్నారని వార్తలు, కథనాలు వెలువడుతున్నాయి. ఆనారోగ్యం కారణంగా ఉద్యమంలో కొనసాగలేక గణపతి లొంగుబాటుకు మంతనాలు జరుపుతున్నారని కొందరంటే, సైద్ధాంతిక విబేధాల కారణంగా ఆయన ఉద్యమం నుండి బయటికొచ్చే పనిలో ఉన్నారని ఇంకొందరు అన్నారు. ఈ వార్తలు దేశం మొత్తంలో ఆసక్తిని రేకెత్తించాయి. జాతీయ మీడియా మొత్తం ఇదే చర్చ. ఎందుకంటే అక్కడ లొంగిపోనున్నాడనే వార్త వచ్చింది గణపతి మీద. మావోయిస్టు ఉద్యమంలో గణపతి ప్రస్తానం సామాన్యమైనది కాదు. నాలుగు దశాబ్దాలకు పైగా ఉద్యమంతో కలిసి నడిచిన వ్యక్తి ఆయన. పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. అందుకే ఆయన లొంగుబాటు అనగానే సంచలనం అయింది.
లొంగిపోతే అతను గణపతి ఎందుకవుతాడు ?
దళ సభ్యుడిగా ప్రారంభమైన గణపతి పొలిట్ బ్యూరో సభ్యుడు, కార్యదర్శి స్థాయికి ఎదిగారు. పీపుల్స్ వార్ సహా దేశంలో ఉన్న అన్ని గెరిల్లా దళాలను సమీకరించి మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియాతో విలీనం గావించడంలో గణపతి పాత్ర ఎంతో విశేషమైనది. ఈ విలీనం తర్వాతే పీపుల్స్ వార్ పార్టీ మావోయిస్టు పార్టీగా పరిణామం చెందింది. గణపతి నాయకత్వంలో పార్టీ ఎన్నో ఆపరేషన్లు నిర్వహించింది. సుమారు 13 రాష్ట్రాల పోలీసులకు గణపతి మోస్ట్ వాంటెడ్. ఆయన మీద కోటి రూపాయల రివార్డ్ ఉంది. దండకారణ్యంలో ఎన్నోసార్లు పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నారు గణపతి. పోలీసులు ఎన్ని హంటింగ్ ఆపరేషన్స్ నిర్వహించినా, దళం సభ్యులు తగ్గుతున్నా, కీలకమైన అటవీ ప్రాంతాల మీద పట్టు కోల్పోతున్నా నాయకుడిగా గణపతి బెదరలేదు.
ప్రస్తుతం ఆయన వయసు ఏడు పదులు పైమాటే. రక్తపోటు, మోకాళ్ళ నొప్పులు లాంటి ఆరోగ్య సమస్యలు ఆయన్ను బాధిస్తున్నాయి. ఎక్కడికెళ్లినా మోసుకెళ్ళాల్సిన పరిస్థితి. అందుకే ఆయన కొంతకాలం క్రితమే కార్యదర్శి పదవి నుండి తప్పుకున్నారు. ప్రస్తుతం సలహాదారుగా ఉన్నారు. పార్టీ పట్ల, ఉద్యమం పట్ల ఆయనకు సైద్దాంతిక విబేధాలు తలెత్తాయనే మాట ముమ్మాటికీ అవాస్తవమనే అనుకోవాలి. గత నాలుగు దశాబ్దాలుగా రాని తేడాలు ఇప్పుడొచ్చాయని అనుకోలేం. వచ్చినా వాటిని పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు గణపతికి ఖచ్చితంగా ఉంటాయి. నాలుగు దశాబ్దాలు పనిచేసిన వ్యక్తికి పార్టీలో ఆమాత్రం విలువ ఉండదని అనుకోవడానికి లేదు. నమ్మిన సిద్దాంతం కోసం మంచిదో చెడ్డదో ఒక మార్గాన్ని ఎంచుకుని అందులో నలభై ఏళ్లు ప్రయాణం సాగించిన వ్యక్తి ఇప్పటికిప్పుడు లొంగిపోతారని జరిగిన ప్రచారాన్ని ఎలా నమ్ముతాం. ఇదే విషయాన్ని మావోయిస్టు కేంద్ర కమిటీ ధృవీకరించింది.
మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన లేఖలో మోదీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర, తెలంగాణ మరియు ఛత్తీస్గడ్ ఇంటెలిజెన్స్ సంస్థలు కలిసి గణపతి లొంగుబాటు అనే కట్టుకథను అల్లాయనే వివరణ ఉంది. ఇలాంటి నీచమైన ఎత్తుగడలను తాము ఖండిస్తున్నామని, అనారోగ్యం కారణంగానే గణపతి స్వచ్ఛందంగా కార్యదర్శి పదవి నుండి తప్పుకున్నారని అంటూ సిద్ధాంత పరంగా, రాజకీయంగా మా నాయకత్వం దృఢంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాం. మా నాయకత్వపు ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే ఇటువంటి కట్టుకథలు అల్లుతున్నారు.
ప్రభుత్వాల దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నాం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతాం అన్నారు. ఈ లేఖతో గణపతి లొంగుబాటు వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది.
విప్లవోద్యమం లొంగుబాటుకు ఏర్పాట్లు చేస్తుందా ?
లొంగుబాటు వార్తలని జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రముఖంగా ఆరోగ్యం సహకరించకే గణపతి లొంగిపోతున్నారంటూ ప్రచారం జరిగింది. అంతేకానీ ఎక్కడా సైద్దాంతిక విబేధాలతో లొంగిపోతున్నారని ఎక్కడా రాలేదు. మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు, కొన్నాళ్ల క్రితం పార్టీతో వ్యతిరేకించి పోలీసుల ముందు సెరెండర్ అయిన జంపన్న కూడ గణపతికి, పార్టీకి మధ్యన సైద్దాంతిక విబేధాలు తలెత్తే అవకాశం లేదన్నట్టే మాట్లాడారు. కనుక విబేధాలు అనే మాటకు ఇక్కడ తావేలేదు. ఒకవేళ నిజంగా భరించలేని ఆరోగ్య సమస్యలు ఉంటే వారిని పార్టీ వదలుకోదు. రహస్యంగా చికిత్స చేయించి బాగోగులు చూసుకుంటుంది. గతంలో పార్టీ వ్యవస్థాపక సభ్యుడు కొండపల్లి సీతారామయ్యకు ఆరోగ్యం సరిలేకపోతే అలాగే అఙ్ఞాతంలో ఉంచి ట్రీట్మెంట్ చేయించారు.
సభ్యుడితో సైద్దాంతిక విబేధాలు లేకుండా పార్టీ లొంగుబాటుకు అంగీకరించదు. అలా అంగీకరిస్తే అది విప్లవోద్యమ పార్టీ కానేకాదనే విషయాన్ని ఇక్కడ గుర్తుచేసుకోవాలి. వీలైనంత వరకు సిద్దాంతాలకు కట్టుబడిన వారిని ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా కాపాడుకోవడానికే పార్టీ ప్రయత్నిస్తుంది తప్ప లొంగిపొమ్మనదు. ఇక ప్రాణాపాయం తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే బయటకు పంపుతుంది. అది కూడ లొంగిపోయినట్టు కాదు.. వారికి వారుగా పోలీసులకు దొరికిపోనట్టు ఉంటుంది వ్యవహారం. అంతేతప్ప పార్టీ పోలీసులు, రాజకీయ నాయకులతో సంప్రదింపులు జరిపి లొంగుబాటు ఏర్పాట్లు చేయదు. సో.. ఎవరు పుట్టించారో, ఏ వ్యూహంతో పుట్టించారో కానీ గణపతి లొంగుబాటు వార్తలన్నీ కట్టు కథలే.