చంద్రబాబు గారు పాడిపరిశ్రమ అభివృద్ధిలో ఎన్నో ఏళ్ళు అనుభవాన్ని గడించి, అలాగే కూరగాయల పెంపకంలో పిహెచ్ డి తీసుకుని ఆ తరువాత ఎం ఫిల్ చేసి, ఆ తరువాత ఎమ్మే చదివి, ఆ తరువాత డిగ్రీ లో పాలపితుకు శాస్త్రం మీద స్పెషలైజ్ చేసి హెరిటేజ్ అనే ఒక పాలవ్యాపారాన్ని ప్రారంభించారు…ఎపుడో ముప్ఫయి ఏళ్ళక్రితం అనుకుంటాను. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం విజయ డైరీ, సంగం డైరీ చాలా ప్రాచుర్యంలో ఉండేవి. ముఖ్యంగా ప్రభుత్వరంగంలో విజయ డైరీ పాలసేకరణలో అగ్రగామిగా ఉండేది. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో చాలాచోట్ల విజయ సంస్థల ఆఫీసులు పనిచేస్తుండేవి. హైద్రాబాద్ లాలాపేట్ లో గల విజయ డైరీ ఆఫీసుకు సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో వెళ్తే విధులు ముగించుకుని వేలాదిమంది ఉద్యోగులు యూనిఫార్మ్స్ ధరించి బయటకు వస్తుంటే కవాతు చేస్తున్న సైన్యంలా అనిపించేది. నాణ్యమైన ఉత్పత్తులకు, నమ్మకానికి ప్రతీకగా విజయ డైరీ పాల ఉత్పత్తిదారుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.
ఎన్ని ప్రయివేట్ పాల సేకరణ సంస్థలు పుట్టుకొచ్చినప్పటికీ అవన్నీ విజయ బ్రాండ్ కు చాలా దిగువస్థాయిలో ఉండేవి. విజయ సంస్థలో ఉద్యోగం చెయ్యడం అంటే అదొక గర్వకారణంగా ఉండేది. సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఉత్పత్తుల్లో రాయితీ ఉండేది. పాలు, పెరుగు, వెన్న, నూనె నుంచి లస్సీ, సుగంధపాలు లాంటి డజను రకాల ఉత్పత్తులు వినియోగదారులను అలరించేవి. ఒకప్పుడు ఒక్క భాగ్యనగరంలోనే రోజుకు అయిదు లక్షల లీటర్ల పాలను సరఫరా చేసేవారు. రైతులకు చెల్లింపులు కచ్చితంగా జరిపేవారు. విజయ డైరీకి పాలు అమ్ముకుంటూ రైతులు నిశ్చింతగా బతికారు ఒకప్పుడు. విజయ డైరీకి మేనేజింగ్ డైరెక్టర్ గా ఐఏఎస్ అధికారి ఉండేవారు అంటే విజయ డైరీ ఎంత పెద్ద సంస్థగా విస్తరించి రైతుల మనసులను గెల్చుకుందో అర్ధం చేసుకోవచ్చు.
విజయను అపజయను చేసింది చంద్రబాబే
చంద్రబాబు ఎన్టీఆర్ అల్లుడుగా మారిన తరువాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోగానే మామగారి పంచన చేరిపోయాడు. ఇక అక్కడినుంచి తెలుగుదేశంలో ఆయన ఏవిధంగా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాడో అందరికీ తెలుసు. హెరిటేజ్ సంస్థను ఆయన ముప్ఫయి ఏళ్ళక్రితం ప్రారంభించారు. ప్రారంభంలో మోహన్ బాబు, మరికొందరిని భాగస్వాములను చేసుకున్నప్పటికీ, ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత తన అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. నమ్మి పెట్టుబడులు పెట్టిన భాగస్వాములను బయటకు వెళ్లగొట్టారు. ప్రారంభంలో అంతంతమాత్రంగా ఉన్న హెరిటేజ్ పెద్ద స్థాయికి ఎదగాలంటే ముందుగా ప్రముఖ పోటీదారు అయిన విజయ డైరీని భ్రష్టుపట్టించాలి అని గ్రహించారు.
విజయ సంస్థను దివాళా తీయించారు
ఇక అప్పటినుంచి విజయడైరీని బలహీనపరచడం ప్రారంభించారు చంద్రబాబు. విజయ పాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయించడం, ఉద్యోగులను తొలగించడం, వీఆర్ ఎస్ ప్రకటించడం, సంస్కరణల పేరుతో ధరలు పెంచడం, ఉద్యోగభద్రత లేకుండా చెయ్యడం, తాత్కాలిక కొలువులు ఇస్తూ ఉద్యోగుల్ని నిరంతరం భద్రతలో ఉంచడం మొదలైన టక్కుటమారగజకర్ణగోకర్ణ విద్యలన్నింటిని ప్రదర్శించి విజయ సంస్థను దివాళా తీయించడంలో చంద్రబాబు కృతకృత్యులైనారు. చంద్రబాబు అధికారంలో ఉండటంతో దాన్ని వ్యాపారసంస్థగా వృద్ధి చెయ్యడం సులభం అయింది. స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ కూడా చేశారు.
చంద్రబాబు పవర్ లో ఉంటేనే హెరిటేజ్ పవర్
జాగ్రత్తగా పరిశీలించండి. 2014 లో చంద్రబాబు అధికారంలోకి రాకముందు హెరిటేజ్ షేర్ ధర వంద రూపాయలు మాత్రమే ఉండేది. ప్రతి ఏడాదీ నష్టాలను ప్రకటిస్తుండేది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడాది తిరక్కముందే హెరిటేజ్ షేర్ ధర తారాజువ్వలా దూసుకెళ్లింది. రెండేళ్లలోనే ఒక్కో షేర్ ధర వెయ్యిరూపాయలకు చేరింది. లాభాలు ఆకాశాన్ని అంటాయి. మోడీ ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు చేయడానికి కొంతకాలం ముందే ఆ సమాచారం చంద్రబాబుకు అందిందని, అందువల్లనే నోట్ల రద్దు ప్రకటనకు వారం రోజుల ముందు తన హెరిటేజ్ సామ్రాజ్యంలో అధికభాగాన్ని ఫ్యూచర్ గ్రూపు వారికి అమ్మేసి వందల కోట్ల రూపాయల లాభాన్ని చంద్రబాబు ఆర్జించారని అంటారు.
నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా
హెరిటేజ్ వ్యాపార వ్యవహారాలు చంద్రబాబు కుటుంబ సభ్యులు చూస్తుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అమూల్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మిగిలిన అన్ని కంపెనీలకన్నా అమూల్ కంపెనీ వారు లీటరుకు నాలుగు రూపాయలు అదనంగా రైతులకు చెల్లిస్తారట. ఇది నిజమైతే రైతుకు అమూల్ గొప్ప వరప్రసాదమే. అమూల్ ప్రపంచప్రసిద్ధమైన కంపెనీ. గుజరాత్ కేంద్రంగా పనిచేసే అమూల్ చాలాకాలంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా తన పాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. ముందుగా కంపనీకి ఉన్న గుడ్ విల్ చాలా పెద్దది. అమూల్ రాకతో హెరిటేజ్ కంపెనీకి దెబ్బ తగులుతుందేమో అని చంద్రబాబుకు భయం ఆవరించింది. అందుకే తన పార్టీ వారితో రాష్ట్రంలో విజయా ఉండగా గుజరాత్ లోని అమూల్ ను తీసుకొస్తున్నందుకు విమర్శలు చేయిస్తున్నారు. కొరియా ఫోన్లు, చైనా ఫోన్లు విచ్చలవిడిగా వాడుతున్న ఈ రోజుల్లో గుజరాత్ అనే రాష్ట్రంలోని మనదేశ కంపెనీ మన రైతుల దగ్గర పాలు కొంటుంటే అభ్యంతరం దేనికి? అమూల్ పుంజుకుంటే హెరిటేజ్ పవర్ తగ్గిపోవడం ఖాయం. నాడు తాను విజయకు పట్టించిన గతే నేడు తన హెరిటేజ్ కు జగన్ పట్టిస్తాడని చంద్రబాబు భయం. అందుకే ఆయన ప్రభుత్వం మీద పళ్ళు నూరుతున్నారు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు