Haryana YouTuber: యూట్యూబ్ చానల్ పేరుతో గూఢచర్యం? హర్యానాలో జ్యోతి మల్హోత్రా అరెస్ట్

ఆన్‌లైన్ పర్యాటక వీడియోల పేరుతో దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టిన వ్యవహారం హర్యానా రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ‘ట్రావెల్ విత్ జో’ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ పాపులర్ అయిన జ్యోతి మల్హోత్రా ఇప్పుడు గూఢచర్యం కేసులో ప్రధాన నిందితురాలిగా నిలిచారు. పోలీసులు ఆమెతో పాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

భారత సైనిక రహస్యాలను పాకిస్థాన్‌కు చేకూర్చినట్లుగా ఆరోపణలు ఉన్న జ్యోతి, గతంలో ట్రావెల్ వీసాతో పాకిస్థాన్‌ వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ ఆమె పీఏస్‌ఐ (పాకిస్థాన్ ఇంటెలిజెన్స్) అధికారులతో సంబంధాలు కలుపుకుని, పలు సున్నితమైన సమాచారం వారికి అందించిందని హిసార్ పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేసే డానిష్ అనే అధికారితో పరిచయం ఈ వ్యవహారానికి గట్టి ఆధారమని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

పాకిస్థాన్‌లో మూడు సార్లు పర్యటించిన జ్యోతి, అక్కడ గూఢచారులైన షకీర్, రాణా షాబాజ్‌లను కలిశారని దర్యాప్తులో తేలింది. జ్యోతి వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి మెసేజింగ్ యాప్‌ల ద్వారా నిరంతరం సంబంధాలు కొనసాగించిందని అధికారులు పేర్కొన్నారు. అనుమానాలు రాకుండా ఉండేందుకు షకీర్‌ను ఆమె ఫోన్‌లో ‘జాట్ రణధావా’ పేరుతో సేవ్ చేసుకున్నారన్న వివరాలు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు అయ్యాయి.

పర్యాటక బ్లాగర్ లో దేశ భద్రతను లీక్ చేయడం పెరుగుతున్న డిజిటల్ మోసాలపై ఆందోళన పెంచుతోంది. చైనా, బంగ్లాదేశ్, యూఏఈ వంటి దేశాల్లోనూ జ్యోతి ట్రావెల్ వీడియోల పేరిట ప్రయాణాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసులో కేంద్ర నిఘా సంస్థలూ చేరడంతో విచారణ మరింత ముమ్మరంగా సాగుతోంది.