పవన్ కు రిస్క్ సలహా: బాబు గురించి తెలిసేనా జోగయ్యా?

కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి, కురు వృద్ధుడు, జనసేన శ్రేయోభిలాషి అయిన హరిరామ జోగయ్యకు తాజాగా ఒక ఆలోచన వచ్చింది. అనుకునదే తడవుగా ఒక ఇంటర్వూలో దాన్ని బయట పెట్టారు. వినేవారికి – జనసైనికులకు సైతం అది కాస్త సానుకూల విషయంగానే అనిపించొచ్చు కానీ… చంద్రబాబు రాజకీయ జీవితంపై ఒక అవగాహన ఉన్నవారికి మాత్రం అది అసాధ్యం అని.. అలాంటి పొరపాటు చేస్తే అన్నగారి గతే పట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇంతకూ హరిరామ జోగయ్య ఏమన్నారు? ఆ కథా కమీషేమిటో ఇప్పుడు చూద్దాం!

తాజాగా ఒక ఛానల్ తో మాట్లాడిన హరిరామజోగయ్య… చంద్రబాబు ముందు ఒక పెద్ద ఆప్షన్ ఉంచారు. అది రిక్వస్టా, సలహానా, సుచనా లేక డిమాండ్ అన్నది తెలియదు కానీ… రాబోయే కాలంలో జనసేన – టీడీపీ కలిసిపోటీ చేసి అధికారంలోకి వస్తే… రెండున్నరేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని, మిగిలిన కాలం పవన్ కల్యాణ్ సీఎంగా ఉండాలని కోరుతున్నారు. ఏపీలో వైసీపీని గద్దె దించాలంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెట్టు వీడి మెట్టు దిగి రావాలని సూచిస్తున్నారు. ఇలా అయిదేళ్ల కాలాన్ని చెరి సగం కాలంగా పవన్ – చంద్రబాబు పంచుకుంటే అది మంచి ఒప్పందం అవుతుందని.. రెండు పార్టీల క్యాడర్ కూడా దీనిని చూసి హర్షం వ్యక్తం చేస్తారని చెబుతున్నారు.

అయితే… ఈ విషయం విన్న విశ్లేషకులు ఈ సందర్భంగా జోగయ్యకు గతం గుర్తుచేస్తూ.. భవిష్యత్తుపై ఒక క్లారిటీ ఇస్తున్నారు. పద్నాలుగేళ్ల పాటు సీఎం గా పదమూడేళ్ల పాటు విపక్ష నేతగా ఉన్న నేత చంద్రబాబు నాయుడు. పదవి కోసం, కుర్చీ కోసం బాబు ఏమైనా చేస్తారు ఎంతకైనా తెగిస్తారు. అలాంటి చంద్రబాబు… తాను కూర్చున్న సింహాసనాన్ని షేర్ చేసుకోమంటే ఒప్పుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు.

ఇదే క్రమ్మలో… ఎన్టీఆర్ ని నాడు గద్దె దించేసినపుడు సొంత తోడల్లుడు ఉప ముఖ్యమంత్రి పదవినే కోరుకున్నా కూడా పనైపోయాక ఆయన్ని సైలెంట్ గా ఎలా సాగనంపారో చరిత్ర పుటలలోకి తొంగి చూస్తే అర్ధం అవుతుంది. అలాంటి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని రెండుగా విడగొట్టి సగం పాలనకే తాను పరిమితమయ్యి… మిగిలిన సగం పవన్ కి ఇస్తారా? ఈ మాత్రం తెలియకుండానే జోగయ్య ఇంతకాలం రాజకీయాలో ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నారు రాజకీయ పండితులు! పవన్ మేలు కోరేవారైతే.. పవన్ పదికాలాలు రాజకీయాల్లో చల్లగా ఉండాలని ఆశించేవారైతే… ఇంకెప్పుడూ ఇలాంటి రిస్క్ సలహాలు ఇవ్వొద్దని సూచిస్తున్నారు పవన్ అభిమానులు!