“ప్రేమ అనే రెండక్షరాల మాట నా జీవితాన్ని మార్చింది, ఈ జీవితం ఇంత అద్భుతంగా మారడానికి కారణం ఆ ప్రేమే”.. అంటారు కొందరు. “ఈ రోజు నా జీవితం ఇంత దారుణంగా ఉందంటే.. భవిష్యత్తు అంధకారంలో పడిందంటే కారణం ప్రేమ”.. అని వాపోతుంటారు మరికొందరు. ఇంతకు ప్రేమ అంత గొప్పదా.. ప్రేమ అంత ఘోరమైనదా..? రెండు వైపులా పదునున్న ఆ కత్తి (ప్రేమ) హడావిడి ఈ రోజు!
ఈ రోజు ప్రేమికుల దినోత్సవం. టీనేజ్ జనాల దగ్గరనుంచి పెళ్లై పాతిక ముప్పైఏళ్లయిన వారు కూడా చేతిలో గులాబీ పూలు, చాక్లెట్లు, కేండిల్ నైట్ పార్టీలు… ఇలా ఎవరి స్థాయిలో వారు తమ తమ ప్రేమలను వ్యక్తపరచుకుంటూ, ప్రేమను పంచుకుంటూ గడుపుతుంటారు. మరికొంతమంది మాత్రం కత్తులు పట్టుకుని, యాసిడ్ బాటిల్స్ పట్టుకుని తిరుగుతుంటారు! ప్రేమలో అన్ని రకాలు ఉన్నాయా? లేవు..!
ప్రేమ అంటే…?
నమ్మకమే ప్రేమ.. నిస్వార్ధంగా ప్రేమించడమే ప్రేమ.. నిబద్ధతే ప్రేమ.. క్షమాగుణమే ప్రేమ.. తప్పులెన్నకపోవడమే ప్రేమ.. సర్ధుకుపోవడమే ప్రేమ.. సంస్కారం మరువకపోవడమే ప్రేమ.. నిత్యం ఎవరికి వారు సంస్కరించుకోవడమే ప్రేమ.. తీపిని స్మరించుకుంటూ – చేదుని త్యజించడమే ప్రేమ!
ప్రేమ కానిది ఏది..?
ప్రేమించిన మనిషి దూరం అయితే దేవదాసుగా మారడం ప్రేమకాదు! నిజంగా ఏ పరిస్థితుల్లో ఆ మనిషి దూరమవ్వాల్సి వచ్చిందో పరిపక్వతతో ఆలోచన చేయకపోవడం ప్రేమకాదు! మోసం చేసిందని, ప్రేమని అంగీకరించలేదని కత్తితో పీక కోయడం, యాసిడ్ పోయడం ప్రేమ కాదు! వేదించడం – బ్లాక్ మయిల్ చేయడం ప్రేమ కాదు! ఫైనల్ గా… ప్రతీకారేచ్చకు పాల్పడేది ప్రేమ కాదు!
అర్థం చేసుకుంటూ.. ఆస్వాదించుకుంటే ప్రేమ అంత గొప్పది లేదు! కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రేమించుకుని, పెళ్లిళ్లు చేసుకుని సక్సెస్ ఫుల్ గా తమ జీవితాలను గడుపుతున్నవారు చెప్పే మాట ఇది! అలా ఉండేవారికి ప్రతిరోజూ ప్రేమికుల రోజే అనేది వారి మాట!
అనుమానంతో, అపనమ్మకంతో, అర్థం చేసుకోలేని ప్రేమ వృథా! అది ప్రేమే కాదు.. దానికి ప్రేమ అనే పేరు సూటు కాదు! యుక్తవయసులో హార్మోన్ల ప్రభావం వల్ల కలిగే ఆకర్షణ మాత్రమే ప్రేమ కాదు!
ఈ విషయాలు గ్రహించిన వారందరికీ “ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు”! గ్రహించని వారికి, గ్రహించలేని వారికి ఈ రోజుతో ఏమీ సంబంధం లేదు!