గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటిదాకా ఎక్కడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల విషయమై మాట్లాడినట్లు కనిపించడంలేదు. తెలంగాణ టీడీపీ మాత్రం కొన్ని డివిజన్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది. గతంలో.. అంటే, అప్పటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో నానా యాగీ చేశారు. కానీ, ప్రయోజనం శూన్యం. దాంతో, ఈసారి చంద్రబాబు పూర్తిగా సైలెంటయిపోయారు.
అధినేత పట్టించుకోకపోతే ఎలా.?
ఓ పార్టీ అధినేత, కీలకమైన ఎన్నికల సమయంలో సైలెంటయిపోవడం ఆశ్చర్యకరమే. ఇక, నందమూరి బాలకృష్ణ ప్రచారం మీద కొన్ని డివిజన్లలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చాలా ఆశలే పెట్టుకున్నారు. అయితే, బాలయ్య ఆచూకీ కూడా వారికి దొరకడంలేదు. తెలంగాణలో ఆ మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు బాలయ్య కూడా ప్రచారం చేశారు. ప్రచారం సందర్భంగా మీసం మెలేశారు.. తొడ కొట్టారు కూడా. కానీ, బాలయ్య ప్రచారం ఓట్లను రాల్చలేకపోయింది. దాంతో, బాలయ్య మీద కూడా తెలంగాణ టీడీపీ ఆశలు వదిలేసుకుంది.
కూకట్‌పల్లిలో టీడీపీ చతికిలపడిందిలా.!
కూకట్‌పల్లి ఉప ఎన్నిక సందర్భంగా నందమూరి హరికృష్ణ కుమార్తెను బరిలోకి దించారు అప్పట్లో చంద్రబాబు. కానీ, ఆమె ఓటమి పాలయ్యారు.. సోదరి ఎన్నికల్లో నిలబడినా, ఆమెకు మద్దతుగా ప్రచారం చేయడానికి కళ్యాణ్‌రాం, జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. నందమూరి తారకరత్న తనవంతుగా ఏదో ప్రయత్నమైతే చేశారనుకోండి.. అది వేరే సంగతి. ఇక్కడ ఆంధ్రా ఓటర్లు ఎక్కువ.. పైగా, టీడీపీకి బోల్డంత క్యాడర్ వున్న నియోజకవర్గమిది.
గ్రేటర్ టీడీపీలో బీభత్సమైన సైలెన్స్..
గ్రేటర్ పరిధిలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్‌గా వుండేది. ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గా వున్న చాలామంది టీడీపీ నుంచి రాజకీయంగా ఎదిగినవారే. వాళ్ళంతా వివిధ పార్టీల్లో ఉన్నతమైన పొజిషన్‌లో వున్నారు ప్రస్తుతం. తమతోపాటే నేతలు క్యాడర్‌ని కూడా వెంటేసుకుపోయారు. చంద్రబాబు రెండు నాల్కల ధోరణి కాస్తా.. టీడీపీని తెలంగాణలో, మరీ ముఖ్యంగా జీహెచ్‌ఎంసీలో నిండా ముంచేసింది.