వైసీపీలోకి వెళ్ళాలనే ప్రయత్నాలు విఫలమయ్యాయి.. బీజేపీ వైపు చూసినా ఉపయోగం లేకుండా పోయింది. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రస్తుత పరిస్థితిని చూసి, ఆయన అనుచరగణమే తీవ్రస్థాయి డైలమాని ఎదుర్కొంటోంది. మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రేణులతో గంటా శ్రీనివాసరావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘ఇకపై పార్టీలో యాక్టివ్‌గా వుంటాను..’ అంటూ ఆ సమావేశంలో గంటా శ్రీనివాసరావు చెప్పారట. కానీ, తెలుగు తమ్ముళ్ళు గంటా శ్రీనివాసరావుని విశ్వసించే పరిస్థితుల్లో లేరు. నిజానికి, గంటా శ్రీనివాసరావు తెలివైన పొలిటీషియన్. అధికారం ఎక్కడుంటే, అటువైపు ఆయన వుంటారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో లెక్కలేసుకుని కూడా, అందుకు తగ్గట్టు రాజకీయాలు చేస్తారాయన. 2019 ఎన్నికల సమయంలోనూ గంటా తన వ్యూహాల్ని అమల్లో పెట్టాలనుకున్నారుగానీ, అవంతి శ్రీనివాస్‌కి ఆహ్వానం పలికిన వైసీపీ, గంటా శ్రీనివాసరావుని పక్కన పెట్టింది.
అందుకు, గంటా ‘తచ్చాడిన వైనం’ కూడా ఓ కారణమేనంటారు విశాఖ జిల్లా రాజకీయాల గురించి బాగా తెలిసినవారు. ఎన్నికల తర్వాత అందరికంటే ముందే గంటా, వైసీపీ పంచన చేరతారనుకుంటే, మంత్రి అవంతి శ్రీనివాస్.. అందుకు మోకాలడ్డారు. దాంతో పరిస్థితి రివర్స్ అయిపోయింది. చిత్రమేంటంటే, బీజేపీలోకి కూడా ఆయనకు ఎంట్రీ లభించకపోవడం. సిట్టింగ్ ఎమ్మెల్యే, దానికి తోడు.. అనుచరగణం బాగానే వున్న నాయకుడు.. సామాజిక వర్గ సమీకరణాలు తెలిసిన వ్యక్తి.. తనతోపాటు కొందరు కీలక నేతల్ని పోగేయగల సత్తా వున్న లీడర్ గంటా శ్రీనివాసరావు. కానీ, గంటాని ఎవరూ నమ్మని పరిస్థితి. ఈ మధ్యన ఇంకోసారి గంటా శ్రీనివాసరావు, వైసీపీలోకి వెళ్ళేందుకు ప్రయత్నించారట. అదీ కొద్ది రోజుల క్రితమే జరిగిందని సమాచారం. ఇక్కడ ఇంకోసారి మంత్రి అవంతి శ్రీనివాస్ నుంచి ఆయనకు ‘సెగ’ తగిలిందనేది తాజాగా రాజకీయ వర్గాల్లో విన్పిస్తోన్న హాటెస్ట్ గాసిప్.