రోజు రోజుకీ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. “టార్గెట్ కేసీఆర్”.. గా విపక్షాలు తమ తమ అంబుల పొదిలో కొత్త కొత్త అస్త్రలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ సమయంలో తెలంగాణలో వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిళ కూడా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగుల సమస్యలు, టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ లపై షర్మిళ అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో.. గద్దర్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆమె తరుపున గొంతెత్తుతానని భరోసా కల్పించారు. ఈ నేపథ్యంలో… ఈసారి ఎన్నికల్లో పోటీచేయాలని, అది కూడా డైరెక్ట్ గజ్వేల్ లో బరిలోకి దిగాలని ఫిక్సయ్యారంట గద్దర్.
ప్రజా యుద్ధనౌక గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. తాను పుట్టి పెరిగిన తూప్రాన్ లో రాజకీయాల్లో పోటీచేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా… త్వరలోనే అల్వాల్ వెంకటాపూర్ నుంచి తన మకాంను తూప్రాన్ మార్చుకుంటున్నారు. అనంతరం అక్కడ తన సోదరుడు నరసింగరావు ఇంట్లో ఉండి.. రాజకీయ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై పోటీ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని గద్దర్ వెల్లడించారు.
అవును… రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీచేస్తానని గద్దర్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఫలితంగా రాబోయే ఎన్నికల్లో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారబోఉతున్నాయి. ఇందులో భాగంగా త్వరలోనే తూప్రాన్ పట్టణంలో 10 వేల మందితో భారీ బహిరంగసభ నిర్వహించడానికి గద్దర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారట. దీంతో… గద్దర్ రాజకీయంగా తన కార్యకలాపాలు తూప్రాన్ నుంచి మొదలుపెడితే… ఆ ప్రభావం మెదక్, సిద్దిపేట రెండు జిల్లాలపై ఉంటుందనేది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా… తూప్రాన్‌లో పుట్టిపెరిగిన గద్దర్ ఆ తరువాత సికింద్రాబాద్ అల్వాల్ పరిధిలోని వెంకటాపూర్ లో నివాసముంటున్న విషయం తెలిసిందే. గజ్వేల్ నియోజకవర్గంతో గద్దర్ కు సన్నిహిత సంబందాలున్నాయి. ఈ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి దళిత సంఘాలు, ఇతర సంఘాల ప్రతినిధులు గద్దర్ ను రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణకు గద్దర్ వస్తుంటారు.