ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర తొలి అధికార భాషా సంఘం అధ్యక్షుడు వావిలాల గోపాలకృష్ణయ్య స్మారకార్థం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిర్మించిన `వావిలాల ఘాట్` హైజాక్‌కు గురైంది. అధికార తెలుగుదేశం ప్రభుత్వమే దీన్ని దగ్గరుండి మరీ హైజాక్ చేసింది. వావిలాల ఘాట్ కాస్తా ఎన్టీఆర్ పార్కుగా రూపాంతరం చెందింది.
వావిలాల ఘాట్ కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమించిన ప్రభుత్వం అక్కడ 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఆ విగ్రహం ముందు నిల్చుని చంద్రబాబు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. వావిలాల స్మృతివనాన్ని ఎన్టీఆర్ ఉద్యానవనంగా మార్చేయడంతో స్థానికంగా నిరసన వ్యక్తమౌతోంది. వావిలాల గోపాలకృష్ణయ్య 1906 సెప్టెంబర్ 17న సత్తెనపల్లిలో జన్మించారు.
1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని తొమ్మిది నెలల పాటు కారాగార శిక్ష అనుభవించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మరోసారి అరెస్టు అయ్యారు. 1946-47 మధ్య అజ్ఞాతవాసం గడిపారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత 1952లో తొలిసారిగా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వరుసగా నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు.
కమ్యూనిస్టు పార్టీ ఆయనకు అండగా ఉండేది. సహకార, గ్రంథాలయ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. 1990లో సంపూర్ణ మద్య నిషేధ రాష్ట్ర స్థాయి కమిటీ అధ్యక్షునిగా, 1976-78 మధ్యకాలంలో అధికార భాషా సంఘం అధ్యక్షునిగా పనిచేశారు. నిరాడంబర జీవితాన్ని గడిపిన ఆయన జీవితం గడిపారు. అభిమానులు ఆయనను ‘ఆంధ్రా గాంధీ’గా పిలుస్తారు.
‘కళాప్రపూర్ణ’, ‘పద్మ భూషణ్’ అవార్డులను అందుకున్నారు. 2003, ఏప్రిల్ 29న ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. సత్తెనపల్లిలో అంత్యక్రియలకు హాజరైన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు ఎకరాల్లో వావిలాల ఘాట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రస్ ప్రభుత్వం ఘాట్‌ను అభివృద్ధి చేసింది.
వావిలాల ఘాట్ విస్తరణ పేరుతో మరోసారి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం..అక్కడ ఎన్టీఆర్ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. 56 ఎకరాల్లో ఉన్న చెరువులో ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. ఈ చెరువుకు తారకరామ సాగర్‌గా పేరు పెట్టింది.
వావిలాల ఘాట్ విస్తరణ కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమించింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ స్వయంగా ఈ పనులను పర్యవేక్షించారు. ఇప్పుడది ఎన్టీఆర్ ఉద్యానవనంగా రూపుదిద్దుకుంది. వావిలాల ఘాట్ కోసం కేటాయించిన స్థలాన్ని కూడా ఉద్యానవనంలోకి కలిపేశారు. దీనిపై వావిలాల కుటుంబీకులు, స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది.