చిన్నా, పెద్దా… సీనియర్, జూనియర్ అనే తారతమ్యాలు ప్రస్తుతం టీడీపీలో లేవు. ఎవరైనా చంద్రబాబును వాయించి వదలొచ్చు.. ఎవరైనా ఆయనపై ఒత్తిడి తేవొచ్చు.. ఎవరైనా ఆయనకే రివర్స్ లో అల్టిమెటం జారీచేయొచ్చు! ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి అంత దయనీయంగా మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు.
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ టీడీపీలో సీట్ల పంపకం చంద్రబాబుకు కత్తిమీద సాములా మారే ప్రమాధం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే జనసేనతో పొత్తు ఉంటే 30 – 40 మంది త్యాగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో పాటు.. టీడీపీ బలమైన సీట్లలో ఇతర పార్టీల నుంచి తెచ్చిపెట్టారనే సమస్య మొదలైంది.
ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలో కీలకమైన సత్తెనపల్లి నియోజకవర్గం సీటు కోసం టీడీపీలో భారీ ఫైట్ సాగుతోంది. సత్తెనపల్లి టికెట్ తనకే కావాలని మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం పట్టుబడుతున్నారు. అయితే చంద్రబాబు తనదైన రాజకీయంతో ఆ సీటుకు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ఇంచార్జిగా నియమించారు.
దీంతో… ఇంతకాలం ఏ కన్నా లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా సత్తెనపల్లిలో టీడీపీని కోడెల కాపాడారో… ఈ రోజు ఆయన ఫ్యామిలీని కాదని కన్నాకు సీటు ఇస్తున్నారు. ఇంత దారుణమైన రాజకీయాలు చంద్రబాబు మినహా మరొకరు చేయరనే కామెంట్లు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో నాటి నుంచి రగిలిపోతున్న కోడెల శివరాం తన దూకుడుని మరింతగా పెంచేశారు. ఇందులో భాగంగా… తాజాగా “ఇంటింటికీ మీ కోడెల” పేరుతో ఒక భారీ కార్యక్రమం టెక్ అప్ చేశారు. తన తండ్రి.. ప్రజలకు చేసిన కార్యక్రమాలు గుర్తు చేస్తూ తనకు మద్దతుగా నిలవమని ఆయన ప్రతీ ఇంటికీ వెళ్ళి ప్రజలను కోరుతున్నారు.
తన తండ్రి పేరుని నిలబెడుతూ ఆయన ఈ ప్రాంతానికి చేసిన సేవలను కొనసాగించడానికే తాను సత్తెనపల్లిలో పోటీ చేస్తున్నట్లుగా శివరాం చెప్పారు. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని తాను కొనసాగించి తీరుతాను అని ఆయన అంటున్నారు. దీంతో… సత్తెనపల్లిలో టీడీపీకి ఇంటిపోరు తప్పదనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ సమయంలో ఇప్పటికే పార్టీ టికెట్ ఇస్తే పార్టీ తరుపున పోటీ చేస్తానని.. లేకపోయినా చేస్తానని శివరాం అనడం ఇపుడు సంచలనంగా మారుతోంది. అంటే ఆయన టీడీపీ నుంచి వేరే పార్టీలోకి జంప్ చేస్తారా లేక ఇండిపెండెంట్ గా చేస్తారా అన్నదే చర్చకు వస్తోంది. కోడెల శివరాం వెంట పెద్ద ఎత్తున స్థానిక టీడీపీ క్యాడర్ నడుస్తోండటం గమనార్హం.
మరి ఈ దూకుడుపై చంద్రబాబు ఏమైనా రియాక్ట్ అవుతారా… లేక, తాంబూలాలు ఇచ్చేశాం ఇక మీ ఇష్టం అని కన్నాకు – కోడెల కూ వదిలేస్తారా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా… కోడెల శివరాం దూకుడు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉండటం… సత్తెనపల్లి టీడీపీలో అతిపెద్ద సమస్యగా పరిణమించే ప్రమాదం లేకపోలేదు!