ఒక వైద్యుడు అంటే ప్రజల నమ్మకం, రక్షణ భావన. కానీ ఫ్రాన్స్‌లో ఓ మాజీ సర్జన్ మాత్రం అదే నమ్మకాన్ని హింసగా మార్చాడు. జోయెల్ లె స్కౌర్నెక్ అనే 74 ఏళ్ల డాక్టర్ దాదాపు 25 ఏళ్ల పాటు చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. బాధితుల సంఖ్య వందల్లో ఉండగా, అతడి అరాచకాలు బయటపడిన తీరు విన్నవారిని కుదిపేసింది. చిన్నారులకు చికిత్స చేసే సమయంలో లేదా స్పృహలేని వేళల్లో ఆయన తన కామాన్ని తీర్చేందుకు వారిని లక్ష్యంగా చేసుకున్నాడు.
విచారణలో అతడు నేరాలను ఓ డైరీలో వ్రాసుకున్నట్లు, అసభ్యకర ఫొటోలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది ఒక్క ఒంటరి వ్యక్తి చేసిన దుశ్చర్య మాత్రమే కాదు, ఓ వ్యవస్థ వైఫల్యం కూడా. 2005లోనే అతడు బాలల పోర్నోగ్రఫీ కేసులో పట్టుబడినా, మళ్లీ వైద్యవృత్తిలో కొనసాగడమే దీనికి నిదర్శనం. ప్రత్యేకించి చిన్నారులకు వైద్యం చేసే అనుమతిని కొనసాగించడాన్ని ప్రాసిక్యూటర్ తీవ్రంగా ఎండగట్టారు.
“తెల్ల కోటులో దెయ్యం”గా అతడిని వర్ణించారు. బాధితుల్లో చిన్న పిల్లలు మాత్రమే కాదు, అతని స్వంత మనవరాలు, మేనకోడలు కూడా ఉన్నారంటే అతడి నీచపు స్థాయి అర్థమవుతుంది. తన ఫాంటసీల కోసం వారిని మానవులుగా కాకుండా, ఓ వాంఛనీయ వస్తువుల్లా చూశాడని అతడి కోర్టు వాఖ్యలే చెబుతున్నాయి.
ఈ ఘటన ఫ్రాన్స్‌లో వైద్యులపై ఉన్న నమ్మకాన్ని బలహీనపరిచేలా మారింది. చట్టం పట్ల భయముండకపోతే, ఇటువంటి వ్యక్తులు మన మధ్య తిరుగుతారు. న్యాయస్థానం అతడికి 20 ఏళ్ల కఠిన శిక్ష విధించినా, శతాబ్ద కాలం నష్టపోయిన పిల్లల బాధను తీర్చలేరు. ఈ కేసు ద్వారా, చిన్నారుల భద్రతకు మరింత కఠినమైన నియంత్రణలు అవసరమన్న స్పష్టమైన సందేశం వచ్చింది.