దర్శకుడిపై రేప్ కేసు పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన నటి

ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను రేప్ చేశాడంటూ కేసు పెట్టిన నటి పాయల్ ఘోష్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ అత్యాచారం కేసులో జాతీయ స్థాయిలో హాడావిడి చేస్తున్న ఆమెకు మంచి హైప్ వచ్చింది. ఇటీవలే జాతీయ మ‌హిళా క‌మిషన్‌ను కలిసి హడావిడి చేసిన ఆమె… ఇదే అదునుగా పొలిటికల్ కెరీర్ ను ప్రారంభించింది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి పోయింది. పార్టీ అధ్యక్షుడు రాందాస్ అథవలే సమక్షంలో పార్టీలో చేరారు పాయల్ ఘోష్. పార్టీ మహిళా విభాగానికి ఆమెను ఉపాధ్యక్షురాలిగా నియమిస్తున్నట్లు అథవలే ప్రకటించారు. పార్టీలో చేరిన వెంటనే ఆమెను పార్టీ అగ్రనాయకత్వం కీలకమైన మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిని చేయడం అందర్ని ఆశ్చర్యపరిచింది.


మరోవైపు పాయల్ ఘోష్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని అనురాగ్ ప్రకటించారు. కొంత మంది స్వార్థపరులు మీ టూ ఉద్యమాన్నిఆసరాగా చేసుకొని ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకరి క్యారెక్టర్ ను చెడుగా చూపించి తాము లాభపడాలని చూడడం సరికాదని అన్నారు. మరోవైపు పాయల్ ఘోష్ ఫిర్యాదు మేరకు అసభ్య ప్రవర్తన, లైంగికదాడి, శారీరక హింస తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు.

ఓవైపు ఈ కేసు విచారణ కొనసాగుతూ ఉండగానే సదరు నటి రాజకీయాల్లోకి రావడం అందరి దృష్టిని ఆకర్శించింది. రాజకీయంగా ఎదిగేందుకు అనురాగ్ కశ్యప్ పై ఆరోపణలు చేసిందా లేక సదరు దర్శకుడిని నిలదీయడమే కాకుండా సాటి మహిళలకు అండగా నిలిచేందుకు రాజకీయాల్లోకి వచ్చిందా అనేది తేలడం లేదు. మరోవైపు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏకంగా అంత పెద్ద పదవిని ఎలా కట్టబెట్టిందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.