తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతకు భంగం వాటిల్లేలా ఘోర అపచారం జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అలిపిరి నడకమార్గం వద్ద శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యంగా పడేసిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేసి, తన ఆవేదనను తెలియజేశారు.
Buddha Venkanna: వైసీపీ నేతలపై బుద్ధా వెంకన్న ఆగ్రహం
YS Sharmila: ఈసీ, సీబీఐ, ఈడీలు మోదీ గుప్పిట్లో: షర్మిల సంచలన ఆరోపణలు
భూమన కరుణాకర్ రెడ్డి విడుదల చేసిన వీడియోలో అలిపిరిలోని పాత చెక్ పాయింట్ వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని పడేసి ఉండటాన్ని చూడవచ్చు. మలమూత్రాలు, మద్యం సీసాలు పడేసే చోట ఈ విగ్రహాన్ని వదిలేయడం దారుణమని ఆయన ఆవేదన చెందారు. ఆ విగ్రహాన్ని చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదని వాపోయారు. హైందవ ధర్మం పట్ల, హిందూ దేవతల విగ్రహాల పట్ల ప్రస్తుత టీటీడీ యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
ఈ ఘటనకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్, పాలకమండలి సభ్యులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ తీవ్రమైన విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. హిందుత్వ సంస్థలు, మఠాధిపతులు ఈ అపచారాన్ని గమనించి మేల్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వంపై విమర్శలు: టీటీడీ ప్రస్తుత పాలకమండలి తీరుపై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ నిర్లక్ష్య వైఖరి హిందూ దేవతల పట్ల, హైందవ ధర్మం పట్ల వారికున్న అగౌరవాన్ని తెలియజేస్తోందని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వీడియో విడుదలైన తర్వాత ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలు కూడా టీటీడీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


