తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వివాదాస్పదంగా మారిన అంశం తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలపై ఉత్కంఠ రేగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చాక, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొత్త రూపంలో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ ఏర్పాటుకి ముందు కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించింది. కిరీటం, చీరలో రాజసమైన రూపాన్ని కలిగిన విగ్రహాన్ని ప్రతిష్టించినప్పటినుంచే అది అధికారిక గుర్తింపును పొందింది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ విగ్రహంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది తెలంగాణ కష్టజీవుల సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని, రాజసమైన హావభావాలను కలిగినదిగా ఉందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.
దీంతో ప్రొఫెసర్ గంగాధర్ నేతృత్వంలో కొత్త విగ్రహం రూపకల్పన జరిగింది. పసుపు-పచ్చటి చీర, చేతిలో మక్కజొన్న, వరి, సజ్జ కంకులు ఉన్న సాదాసీదా రూపంలో విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహాన్ని డిసెంబర్ 9న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అయితే, ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. గులాబీ నేతలు కొత్త విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభావానికి లోనైనదిగా అభివర్ణించారు.
ఇక, బీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి. “. కొత్త తల్లి ఎవరు..? తెలంగాణ తల్లినా? కాంగ్రెస్ తల్లినా? అని?” అంటూ ప్రశ్నించడంతో పాటు, గతంలో ప్రతిష్టించిన విగ్రహమే అసలైనది అని నొక్కిచెప్పారు. అంతేగాక, కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇప్పటికీ ఈ విగ్రహం చుట్టూ రాజకీయ రంగు మరింత ముదురుతుండగా, ప్రజలలో ఈ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య పెరుగుతున్న ఈ వివాదం, తెలంగాణ రాజకీయ సమీకరణాలను మరింత చురుకుగా మార్చే అవకాశం కనిపిస్తోంది. మరి కాంగ్రెస్ ముందడుగు ప్రజల్లో ఎలాంటి భావనను హైలెట్ చేస్తుందో చూడాలి.