ఫలక్ నుమా ప్రమాదం వెనుక‌ కుట్ర కోణం… తెరపైకి బెదిరింపు లేఖ!

హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్ నుమా ఎక్స్‌ ప్రెస్ రైలుకు మంట‌లు అంటుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం ఆరు బోగీలు దగ్ధమయ్యాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా… ఎస్ – 4 నుంచి ఎస్-9 బోగీలు కాలి బూడిదయ్యాయని సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ మృతిచెందలేదని అధికారులు ప్రకటించారు.

ఈ సమయంలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వేకు గుర్తు తెలియని వ్యక్తి ఇటీవల బెదిరింపు లేఖ రాసిన విషయం తాజాగా తెరపైకి వచ్చింది. త్వరలో బాలాసోర్‌ తరహా ఊహకందని ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుందని ఫ్రమ్ అడ్రస్ లేని ఆ లేఖలో పేర్కొన్నారట.

వారంరోజుల్లో ఒడిశా తరహాలోనే ప్రమాదం జరుగుతుందని ఆకాశరామన్న ఉత్తరంలో బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తుంది. ఇదే సమయంలో హైదరాబాద్‌ – ఢిల్లీ మార్గంలో ఘటన జరుగుతుందని కూడా ఆ లేఖద్వారా హెచ్చరించాడట.

ఈస్థాయిలో డిటైల్స్ ఉన్న లేఖ దాదాపు నాలుగు రోజుల కింద‌ట‌ ఈ అధికారులకు చేరిందని తెలుస్తుంది. దాంతో వెంటనే అలెర్టయిన అధికారులు పోలీసులకు కంప్లైంట్ చేశారట. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు. దీంతో… లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు పంపారు అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారట.

అయితే, ఈ లేఖపై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా బీ.హెచ్‌.ఈ.ఎల్‌ ప్రాంతానికి చెందిన అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, అతడిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి లేఖకు సంబంధంలేదని అధికారులు చెబుతున్నారు.

ఇలా లేఖ వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. అయితే ఈ ప్రయాణంలో ఒక వ్యక్తి సిగరెట్ తాగుతూ కనిపించాడని, తోటి ప్రయాణికులు వద్దని ఎంతగా వారించినా అవ్యక్తి వినలేదని, అది కూడా ఒక కారణమై ఉండొచ్చనే వాదన కూడా వినిపిస్తోంది.

మరోపక్క ఈ ప్రమాదం వల్ల పలు రైళ్లను రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. సికింద్రాబాద్ – రేపల్లె, సికింద్రాబాద్ – మన్మాడ్ వెళ్లాల్సిన రైళ్లను రద్దు చేశారు. ఇదే సమయంలో తిరువనంతపురం – సికింద్రాబాద్, రేపల్లె- సికింద్రాబాద్ రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.

ఇక, సికింద్రాబాద్ – తిరువనంతపురం, సికింద్రాబాద్ – హౌరా, విశాఖపట్నం – లింగంపల్లి, నర్సాపూర్ – నాగర్‌సోల్ రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు ఆన్ లైన్ వేదికగా వెళ్లడించారు.