ఈ మధ్యకాలంలో ఏది జరిగినా దానికి మతం రంగు పులమడం ఒక సాంప్రదాయంగా మారిపోయింది. పైగా ప్రతీ విషయానికీ ఇలా మతం రంగు పులిమేసి, కొంతమంది అవివేకుల విషయంలో మద్దతు కూడగొట్టొచ్చనే సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే జరుగుతున్నాయి. అయితే తాజాగా మరోసారి రైలు ప్రమాదంపై మత విధ్వేషాలు రెచ్చ గొట్టాలనే బ్యాచ్ ఒకటి ఆ పనిని షురూ చేసింది.
ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదం.. దేశ వ్యాప్తంగా ప్రజల్ని కలిచివేసింది. ఈ ఘోర ప్రమాదంలో 288 మందికి పైగా మరణించగా.. 900 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన సాంకేతిక లోపం వల్లే జరిగిందని కథనాలొచ్చాయి. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన రైల్వే మంత్రి… ఈ ఘటనలో కుట్ర కోణం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో… ఈ విషయంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు!
ఈ వ్యవహారం ఇలా సాగుతుంటే… ఈ రైలు ప్రమాదంపై కూడా కొంతమంది పరిపూర్ణమైన అవివేకంతో రాజకీయాలు చేస్తున్నారు. ఈ రైలు ప్రమాదానికి మసీదులే కారణమంటూ కొంత మంది ఆన్ లైన్ లో ప్రచారం మొదలుపెట్టారు. దీంతో అసలు విషయం పక్కకు పోయి ఇలాంటి కొసరు విషయాలు చర్చకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో ఈ ప్రమాదానికి దేవాలయాలే కారణం అంటూ ఈ పోస్టులకు కౌంటర్ పోస్టులు కూడా పడుతున్నాయి.
అవును… ఈ రైలు ప్రమాదానికి మసీదులే కారణమంటూ కొంత మంది.. కాదు, దేవాలయాలే కారణం అంటూ కొంతమంది మతం రంగు పులుముతూ ఫొటోలను షేర్ చేస్తున్నారు. రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో మసీదు ఉందని కొందరు ఫోటోలను షేర్ చేస్తుండగా… ప్రమాదానికి దూరంగా ఉన్న ప్రదేశం మసీదు కాదని ఇస్కాన్ అని మరి కొంతంమంది అంటున్నారు. గుడిలో సగం మాత్రమే ఫోటో తీసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేసి దానిని మసీదుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఇంకొంతమంది అంటున్నారు.
ఇలా ఒడిశాలో జరిగిన ఈ ఘోరకలికి మత రంగు పులుమి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న ఒడిశా పోలీసులు… నెటిజన్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ దుర్ఘటనకు సంబంధించి ఎవరైనా తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అనంతరం… ఇప్పటికే పోస్ట్ చేసిన, షేర్ చేసిన పోస్టులు డిలీట్ చేయాలని సీరియస్ గా హెచ్చరించారు!