రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ.! నవ్వకండి.. సీరియస్.!

ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

రెండు సూపర్ ఫాస్ట్ రైళ్ళు, ఓ గూడ్సు రైలు.. ఈ ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాదాపు మూడు వందల మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికి పైగా ప్రయాణీకులు గాయాల పాలయ్యారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా వుంది.

అత్యంత వేగంగా వెళ్ళే రెండు లైన్లు.. లూప్‌లైన్‌లో గూడ్సు రైలు.. మెయిన్ లైన్‌లో వెళ్ళాల్సిన సూపర్ ఫాస్ట్ రైలు, లూప్‌లోని గూడ్సు రైలు మీదకు దూసుకుపోవడం.. ఇదంతా సాంకేతిక తప్పిదమో, మానవ తప్పిదంలాగానో అనిపించడంలేదు. పెద్ద కుట్రే దీని వెనుక వుండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, కేంద్రంపై తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం, ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించినట్లు తెలుస్తోంది.

అయితే, సీబీఐ విచారణలో ఏం తేలుతుంది.? ఇప్పుడు దేశంలో సీబీఐ పట్ల జనంలో వున్న విశ్వసనీయత ఎంత.? మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ సాగుతూ సాగుతూ వస్తోంది. చాలా కేసుల్లో సీబీఐది ఇదే తీరు.

మూడొందల మందిని బలికొన్న రైలు ప్రమాదంపై విచారణను సీబీఐకి అప్పగిస్తే.. ఇంకో పదేళ్ళకైనా వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు.