‘నీ ఇంటికొస్తా.. నీ నట్టింటికొస్తా..’ అంటూ ఓ తెలుగు సినిమాలో కథానాయకుడు, విలన్‌కి వార్నింగ్ ఇచ్చేస్తాడు. అచ్చం అలా సినిమా తరహాలోనే ఓ ప్రజా ప్రతినిథి, ఓ మాజీ ప్రజా ప్రతినిథి ఇంటికి వెళ్ళిపోయారు. ఇద్దరి మధ్యా ఎంత రాజకీయ వైరం వుంటే మాత్రం.. ప్రత్యర్థి ఇంటికెళ్ళి దాడి చేయడమేంటి.? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాడిపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దారెడ్డి దూసుకెళ్ళారు. ఈ గొడవకి కారణం, సోషల్ మీడియా పోస్టింగ్ కావడం ఆసక్తికరమైన విషయమిక్కడ. ఓ వ్యక్తి పెద్దారెడ్డి కుటుంబ సభ్యులపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడట. ఆ వ్యక్తి, జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో వున్నాడని పెద్దారెడ్డి వర్గీయులు గుర్తించారట. అంతే, ముందూ వెనుకా చూసుకోకుండా.. తానొక ప్రజా ప్రతినిథినన్న విషయాన్ని మర్చిపోయి మరీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. తన అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి చొరబడిపోయారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి కూర్చునే కుర్చీలో కూడా కూర్చున్నారట పెద్దారెడ్డి. అంతే, ఆ కుర్చీని బయట పడేసి.. తగలెట్టేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్యా యుద్ధ వాతావరణం నెలకొంది. ఆగండాగండీ.. ఇదంతా సినిమా అనుకుని పొరబడేరు.. సినిమాల్లో కూడా ఇలాంటి సన్నివేశాలుండవేమో. ఇంతకీ, పోలీసులు ఏం చేస్తున్నట్లు.? ఏమో మరి.! అది రాయలసీమ.. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేశపరుడే.. ఇది అందరికీ తెల్సిన విషయమే. కానీ, అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథి ఇంగితం ఏమయిపోయిందక్కడ.? సోషల్ మీడియాలో పోస్టింగ్‌పై పోలీసులను ఆశ్రయించొచ్చు. ఎటూ ప్రభుత్వం తమదే గనుక, చిన్న చిన్న విషయాలకే ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేయించేస్తున్నారుగనుక.. సదరు ఎమ్మెల్యేగారికి పెద్దగా ఇబ్బంది ఏమీ వుండదు.. ప్రత్యర్థి మీద పైచేయి సాధించడం తేలికే. అయినాగానీ, వీరత్వం చూపించాలనుకునే యత్నంలో ఎమ్మెల్యే భంగపడ్డారు. ‘నేను ఇంట్లో లేనప్పుడు రావడం మగతనం కాదు..’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి, పెద్దారెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి అంటే.. ఈ మధ్య తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్న వ్యక్తి. ఆ మాటకొస్తే, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన. నోటి దురద కారణంగా చాలా సమస్యలు కొనితెచ్చుకున్నారు. జేసీ దివాకర్‌రెడ్డి సంగతి పక్కన పెడితే, పెద్దారెడ్డి వ్యవహారం వైఎస్ జగన్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. హోంమంత్రి మేకతోటి సుచరిత, ఈ వ్యవహారంపై తమ పార్టీ నేతను వెనకేసుకొచ్చేందుకు కొంత ఇబ్బంది పడ్డారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.