విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో రోజుకో కొత్త అంశం తెరపైకొస్తోంది. మొత్తం 20 వేల ఎకరాల భూములు విశాఖ ఉక్కు పరిశ్రమకు వుండగా, మొత్తంగా విశాఖ ఉక్కు పరిశ్రమ విలువ రెండున్నర లక్షల కోట్లు.. అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక, విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన 20 వేల ఎకరాల భూముల్లో 7 వేల ఎకరాల భూమి నిరుపయోగంగా వుందని, ఆ భూముల్ని ప్లాట్లుగా విభజించి, అమ్మేస్తే.. తద్వారా వచ్చే సొమ్ము, స్టీల్ ప్లాంట్ కష్టాల్ని తీర్చుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయ పడటం వివాదాలకు తావిచ్చిన విషయం విదితమే. కాగా, ఏడు వేల ఎకరాల నిరుపయోగ భూముల అంశం చుట్టూ రకరకాల ప్రచారాలు తెరపైకొస్తున్నాయి.
కొన్ని సూచనలు, సలహాలు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం ముందుకు వస్తున్నాయి. ఎటూ విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలన్న ఆలోచనతో వైఎస్ జగన్ సర్కార్ వుంది గనుక, స్టీలు ప్లాంటు భూముల్ని అందుకు వినియోగించుకుంటే.. పూర్తిస్థాయి రాజధానికి ఆ భూములు సరిపోతాయన్నది కొందరి ఆలోచన. అయితే, ఆ భూములు ఎక్కడ వున్నాయి.? వాటి ప్రస్తుత పరిస్థితి ఏంటి.? అన్నదానిపై మళ్ళీ భిన్నమైన వాదనలున్నాయి. విశాఖ స్టీలు ప్లాంటుపై సర్వ హక్కులూ కేంద్రానికి వున్నాయి. కేంద్రం నుంచి ఆ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలంటే, దానికోసం భారీగా ఖర్చు చేయాల్సి వుంటుంది. సో, అది అంత సులువైన అంశం కానే కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కటి మాత్రం నిజం.. భూముల విలువ అపారంగా పెరిగిపోయింది. వున్న భూముల్ని ఏ ప్రభుత్వమైనాసరే అమ్మాలనే ఆలోచన చేయకూడదు. చేస్తే, భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా భూమి లభ్యత అనేదే వుండదు. వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నించినప్పుడు ఎన్నెన్నో కష్టాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి కొన్ని చోట్ల ప్రైవేటు భూముల్నీ ప్రభుత్వం అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వచ్చింది.