పంచాయితీ పోరు: అనూహ్యంగా పుంజుకున్న జనసేన.!

Janasena

పంచాయితీ ఎన్నికల్లో జనసేన పార్టీ సున్నా చుట్టేసిందనే ప్రచారం అధికార పార్టీ అనుకూల మీడియాలోనూ, ప్రతిపక్షం అనుకూల మీడియాలోనూ జరుగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి పంచాయితీ ఎన్నికలు రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా జరగాలి. పార్టీ గుర్తులేవీ వుండవు ఈ ఎన్నికల్లో. అయినప్పటికీ, పంచాయితీ ఎన్నికలు అనధికారికంగా పార్టీల ప్రమేయంతోనే జరిగాయి. ఏకగ్రీవాల్లో అధికార పార్టీ జోరు కనిపించింది. తొలి దశ పోలింగ్ తర్వాత వచ్చిన ఫలితాల్లోనూ అధికార పార్టీదే పై చేయి. అయితే, ప్రతిపక్షం టీడీపీ పూర్తిగా నీరుగారిపోయిందని వైసీపీ అనుకూల మీడియా చెబుతోంది. కానీ, కింది స్థాయిలో వైసీపీ నేతలకు వాస్తవాలు తెలియకుండా వుండవు. స్థానికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి, గ్రామ స్థాయిలో అధికార పార్టీ పట్ల చాలా వ్యతిరేకత కనిపిస్తోంది. మరోపక్క, తెలుగుదేశం పార్టీ తన పట్టుని నిలబెట్టుకోగా, జనసేన పార్టీ అంచనాలకు మించి బలాన్ని పుంజుకుందని అధికార పార్టీకి చెందిన నేతలే ఆఫ్ ది రికార్డ్‌గా ఒప్పుకోవాల్సిన పరిస్థితి.

Janasena
Janasena

250కి పైగా స్థానాల్లో జనసేన పార్టీ తొలి దశ పంచాయితీ ఎన్నికల సందర్భంగా సత్తా చాటిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ స్థాయిలో కాకపోయినా, కొంతమేర గట్టిగానే జనసేన నిలబడిందని అంటున్నారు. ఇది సహజంగానే అధికార పార్టీకి కొంత ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర, గుంటూరు, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు తదితర జిల్లాలో జనసేన పార్టీ క్రమేణా బలం పుంజుకుంటోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనసేన పార్టీ ఇంకాస్త శ్రద్ధ పెట్టి వుంటే ఇంకా మెరుగైన ఫలితాల్ని పంచాయితీ ఎన్నికల్లో సాధించి వుండేది. పార్టీ రహిత ఎన్నికలయినప్పటికీ, గ్రామ స్థాయిలో ఎవరు ఏ పార్టీ మద్దతుదారు అనేది అందరికీ తెలుసు. ఆ కారణంగానే ఆయా పార్టీలకు చెందిన నేతల్లో జనసేన పట్ల గుబులు కనిపిస్తోంది. అయితే, పార్టీ రహిత ఎన్నికలు గనుక, ఈ ఫలితాల్ని చూసి మురిసిపోకుండా, నియోజకవర్గాల స్థాయిలో పార్టీ బలోపేతం దిశగా జనసేన ఫోకస్ పెట్టాలి. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న దరిమిలా, అవి పార్టీ సహిత ఎన్నికలు గనుక.. జనసేన తన ఫోకస్ పూర్తిగా వాటిపై పెడితే మంచి ఫలితాలు రావొచ్చు.