ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అతి త్వరలో మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నారట. కొద్ది వారాల్లోనే వైఎస్ జగన్, ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారంటూ ఓ మాజీ కేంద్ర మంత్రి.. మాజీ ఎంపీ చెప్పిన జోస్యం నవ్వులపాలవుతోంది. సరే, రాజకీయాల్లో రేపు ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు.. అది వేరే సంగతి. కానీ, ప్రస్తుతానికైతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం అనేది జరగదు.. ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేంత సీన్ ఎవరికీ లేదు కూడా. రాష్ట్రంలో అధికార వైసీపీకి ధీటుగా నిలబడే రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఇంకోటి లేదు. 2024 వరకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగుతారు. ఇంతకీ, జోస్యం చెప్పిన మహానుభావుడెవరబ్బా.? అంటే, ఇంకెవరు తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీకి ఇటీవల తగిలిన దెబ్బతో బహుశా చింతా మోహన్‌కి మైండ్ బ్లాంక్ అయిపోయినట్టుంది.
లేకపోతే, వైసీపీ అంత పెద్ద విజయాన్ని సాధిస్తే.. వైఎస్ జగన్ సామర్థ్యాన్ని ఆయన ఇంకా ఎందుకంత తక్కువ అంచనా వేస్తారు.? వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోసం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అష్టకష్టాలూ పడుతున్న మాట వాస్తవం. వ్యవహారం ఇప్పుడు కోర్టు పరిధిలో వుంది. ఈ నెలాఖరున తీర్పు రాబోతోంది. ఆ తీర్పులో ఏముంటుందోగానీ.. ఇలాగే వుండబోతోందంటూ కొందరు రాజకీయ నాయకులు అప్పుడే పగటి కలలు కనేస్తున్నారు. బహుశా చింతా మోహన్ కూడా అదే బాటలో పగటి కలలు కనేస్తున్నారేమో. బెయిల్ రద్దు కాకుండా వుండేందుకు ఢిల్లీ స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాబీయింగ్ చేస్తున్నారని కూడా చింతా మోహన్ సెలవిచ్చారట. అసలంటూ జగన్ మీద అక్రమాస్తుల కేసు నమోదయ్యిందే.. కాంగ్రెస్ నుంచి ఆయన బయటకు వచ్చినందుకు. ఆమాత్రం కసి కాంగ్రెస్ నేతల్లో ఇంకా జగన్ మీద వుండడంలో వింతేమీ లేదు. కానీ, ఏం లాభం.? కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్ కొట్టిన దెబ్బకి, ఆ పార్టీ పాతాళం కంటే దిగువకి పాతిపెట్టబడింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంతవరకు.