ముందస్తు ముచ్చట.! కేసీయార్ కాదంటున్నా వినరేంటి.?

తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో ముందస్తు ఎన్నికలకు ఓటేసింది. 2019లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి వున్నప్పుడు, 2018 చివర్లోనే ఎన్నికలకు వెళ్ళడం చూశాం. తద్వారా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు విడిగా, లోక్‌సభ ఎన్నికలు విడిగా జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ లాభపడితే, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం నష్టపోయింది. ఈసారి ముందస్తు ఎన్నికలు వెళ్ళే ముచ్చటే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ పదే పదే చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళకపోయినా అసెంబ్లీ ఎన్నికలు విడిగా, లోక్‌సభ ఎన్నికలు విడిగా జరుగుతాయి తెలంగాణలో. వచ్చే ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి వుంది. ఆ తర్వాతి ఏడాది.. అంటే, 2024లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి.

అయితే, ఏ క్షణాన అయినా ముందస్తు ఎన్నికల నగారా కేసీయార్ మోగించేస్తారని గులాబీ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే, ఎమ్మెల్యేలు, ఆశావహులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు, ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక పలితం తర్వాత, తెలంగాణలో బీజేపీతో అంత వీజీ కాదనే నిర్ణయానికి తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చేసింది. బీజేపీ ఇంకాస్త బలపడిందంటే అంతే సంగతులు.. అన్న గట్టి అభిప్రాయంతో వున్న గులాబీ బాస్, ఏ క్షణాన అయినా ముందస్తు ఎన్నికలకు ‘సై’ అనే అవకాశాల్లేకపోలేదట. ‘అబ్బే, ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోం. కేసీయార్ ఈ విషయమై ఇప్పటికే స్పష్టతనిచ్చేశారు..’ అంటూ గులాబీ నేతలు కొంతమంది చెబుతున్నా, మెజార్టీ టీఆర్ఎస్ నేతలు మాత్రం, ముందస్తుకి తాము సర్వసన్నద్ధంగా వున్నామనే అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు.