‘వాపుని చూసి బలుపుగా భ్రమపడుతున్నారు..’ అంటూ భారతీయ జనతా పార్టీపై తెలంగాణలో అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజమే. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో గెలుపు తమదేనని బీజేపీ నినదిస్తున్న వేళ, అంత సీన్ లేదంటూ టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఇంతలోనే, గ్రేటర్ ఎన్నికల నగారా కూడా మోగేసింది. షెడ్యూల్, నోటిఫికేషన్ వచ్చేశాయ్. డిసెంబర్ 1న పోలింగ్. డిసెంబర్ 4న ఫలితాలు. ఇంతకీ, ఎవరిది నిజమైన బలుపు.? ఎవరిది నిజమైన వాపు.?
గులాబీ పార్టీకి ఎదురులేదుగానీ.!
తెలంగాణలో టీఆర్‌ఎస్‌ని ఎదుర్కొనేంత శక్తి ఏ ఇతర రాజకీయ పార్టీకీ లేదన్న అభిప్రాయం తెలంగాణ సమాజంలో గట్టిగానే వుంది. కానీ, లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కి షాక్ తగిలింది. ఇటీవలి దుబ్బాక ఉప ఎన్నికలోనూ ‘కారు’ టైరు పంక్చరయ్యింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్ని టీఆర్‌ఎస్ అంత తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ‘గెలిచేస్తాం..’ అనే ఓవర్ కాన్పిÛడెన్స్‌తోనే అటు లోక్‌సభ ఎన్నికల్లోనూ, ఇటు దుబ్బాక ఎన్నికలోనూ టీఆర్‌ఎస్ బోల్తా కొట్టిన దరిమిలా, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్‌ఎస్.
బీజేపీది విజయోత్సాహం!
లోక్‌సభ ఎన్నికల్లోనే టీఆర్‌ఎస్‌కి షాకిచ్చిన బీజేపీ, దుబ్బాక ఉప ఎన్నికతో ఇంకా పెద్ద షాకిచ్చింది. ముచ్చటగా మూడోసారి ఇవ్వబోయే షాక్‌తో టీఆర్‌ఎస్‌కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందన్నది కమలనాథుల ఉవాచ. ”మాది బలుపు.. ఆ విషయం టీఆర్‌ఎస్‌కి అర్థం కావడంలేదు. ‘వాపు’ అనే భ్రమల్లో వుండి టీఆర్‌ఎస్ దెబ్బతినేసింది దుబ్బాక ఉప ఎన్నికలో. ఇప్పుడిక గ్రేటర్ ఎన్నికల్లోనూ మా బలమేంటో చూపిస్తాం..’ అని బీజేపీ నేతలు అంటున్నారు.
కాంగ్రెస్, టీడీపీ సంగతేంటి.?
మజ్లిస్ ఎలాగూ టీఆర్‌ఎస్‌కి అండగా నిలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ సొంతంగా 50 స్థానాల్లో గెలుస్తామంటోంది. టీడీపీ కూడా తామేం తక్కువ తిన్లేదంటోంది. కానీ, పోటీ మాత్రం బీజేపీ – టీఆర్‌ఎస్‌ల మధ్యనే వుందన్నది నిర్వివాదాంశం. కాంగ్రెస్, టీడీపీ మాత్రం.. ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకుల మీదా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి.