రాత్రి నిద్రలో కనిపించే కలలు కేవలం ఊహ మాత్రమే కాదని.. స్వప్న శాస్త్రం చెబుతోంది. ప్రతి కల వెనుక మన ఆత్మ, మనసు, భవిష్యత్తు మధ్య లోతైన సంబంధం దాగి ఉంటుందని అంటోంది. కొన్ని కలలు మన జీవితంలో ఆనందం, విజయం, శ్రేయస్సు తలుపుతడుతుంటే, మరికొన్ని ప్రమాదం లేదా విపత్తును హెచ్చరిస్తాయని స్పష్టం చేస్తోంది. మనం రాత్రి చూసే ప్రతి కల, మన జీవితం ఏ దిశలో సాగుతోందో చెప్పే సంకేతమని పండితులు సూచిస్తున్నారు.
పండితుల అభిప్రాయం ప్రకారం తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల మధ్య వచ్చే కలలు ఎక్కువగా నిజమవుతాయని చెబుతారు. ఈ సమయంలో మన మనసు అత్యంత ప్రశాంతంగా ఉండటం వల్ల, ఆ కలలు భవిష్యత్తులో జరిగే సంఘటనల సూచనలుగా పరిగణించబడతాయి. అందుకే ఆ సమయంలో వచ్చిన కలలకు లోతైన అదర్ధాలు ఉంటాయని స్పప్న శాస్త్రం సూచిస్తోంది.
కలలో ఒక అందమైన, చక్కగా అలంకరించుకున్న స్త్రీ కనిపిస్తే.. అది అత్యంత శుభప్రదమైన కలగా పరిగణిస్తారు. ఈ కలను చూసిన వ్యక్తికి త్వరలోనే ఆర్థిక లాభాలు, విజయాలు, ఆనందం లభిస్తాయని చెబుతారు. లక్ష్మీ దేవి మీ జీవితంలో ప్రవేశించబోతున్నారనే సంకేతం అని విశ్వాసం ఉంది. ముఖ్యంగా దీపావళి లేదా శుభమాసాలలో ఈ కల వస్తే మరింత అదృష్టంగా పరిగణిస్తారు.
ఇక కలలో ఒక యువతి బంగారు నగలు ధరించి కనిపిస్తే, అది పెండింగ్‌లో ఉన్న పనులు సాఫీగా పూర్తవుతాయని సూచిస్తుంది. మీరు ప్రారంభించిన పనులు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి, కొత్త అవకాశాలు రాబోతున్నాయని ఈ కల చెబుతుంది. కొందరు ఈ కలను “విజయానికి ద్వారం తెరచిన సంకేతం” అని కూడా విశ్వసిస్తారు. ఇక మీరు ఒక అందమైన స్త్రీతో మాట్లాడుతున్నట్లు కలలు కనడం చాలా శుభంగా పరిగణించబడుతుంది. ఇది సమాజంలో మీ ప్రతిష్ఠ, గౌరవం పెరగబోతుందనే సంకేతం. అలాగే మీరు కలలో చెప్పిన మాటలు మీ మనసులో ఉన్న కోరికలు త్వరలో నెరవేరబోతున్నాయనే సూచన కూడా కావచ్చు.
అయితే ప్రతి కలను అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. కలల్లో కనిపించే చిహ్నాలు, వ్యక్తులు, వాతావరణం ఇవన్నీ ఏదో ఒక అర్ధాన్ని సూచిస్తాయి. కలలో పెళ్లి కూతురుగా లేదా పెళ్లికొడుకుగా కనిపిస్తే.. జాగ్రత్తని సూచిస్తుంది. ఇది భవిష్యత్తులో సంభవించబోయే ప్రతికూల పరిస్థితుల గురించి హెచ్చరిక అని పండితులు అంటున్నారు. స్వప్న శాస్త్రం ప్రకారం కలలు మన ఆత్మ, విశ్వ శక్తులతో ఉన్న సంభాషణ. మనలోని ఆలోచనలు, భయాలు, ఆశలు, కోరికలు కలల రూపంలో వ్యక్తమవుతాయి. వాటిని అర్థం చేసుకోవడం ద్వారా మన జీవితం ఏ దిశలో వెళ్తుందో తెలుసుకోవచ్చు. శుభకలలు మనకు ధైర్యం ఇస్తాయి, అశుభకలలు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాయని స్వప్న శాస్త్రం చెబుతోంది.
