కుక్క. మనిషి.! ఎవరు అత్యంత ప్రమాదకారి.?

తెలంగాణ రాష్ట్రంలో ఒకదాని వెంట ఇంకోటి వరుస దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా మూడు ఘటనల గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. ఓ చిన్నారిని కుక్కలు చంపేశాయి. డాక్టర్ ప్రీతిని, ఆమె సీనియర్ వేధించాడు.. ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఇంకో ఘటనలో స్నేహితుడ్ని అత్యంత కిరాతకంగా చంపేశాడో యువకుడు.

చిన్నారిని కుక్కలు చంపేశాయ్.. సో, కుక్కలు పెద్ద నేరం చేసినట్టే. కాదు కాదు, కుక్కల తప్పేముంది.? వాటి విషయంలో తగిన చర్యలు తీసుకోని జీహెచ్ఎంసీ యంత్రాంగానిదే తప్పంతా.. అంటున్నారు కొందరు. ఇంతకీ ఏది తప్పు.? రోడ్డు మీద కుక్కలు వుండడమా.. రోడ్డుపై చిన్నారిని నిర్లక్ష్యంగా వదిలేయడమా.?

ర్యాగింగ్ వ్యవహారన్నే తీసుకుంటే, డాక్టర్ ప్రీతి.. చిన్న విషయం కాదిది. ప్రభుత్వం ఏం చేస్తోంది.? కళాశాల యాజమాన్యం ఏం చేస్తోంది.? సభ్య సమాజం ఏం చేస్తోంది.? కుక్కల కంటే క్రూరత్వం కనిపిస్తుంది ఈ కేసులో దోషిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ అనే వ్యక్తికి సంబంధించి. మరో ఘటనలో, ఓ అమ్మాయి ప్రేమలో పడి.. స్నేహితుడ్ని కిరాతకంగా చంపేశాడో యువకుడు. ఇది ఇంకా దారుణం. సభ్య సమాజం ఎటువైపు పోతోంది.? ప్రభుత్వాలదే కాదు, ఈ తరహా ఘటనల్లో సమాజానికీ బాధ్యత వుంటుంది.

కుక్కల విషయంలో అయినా, అంతకన్నా హీనమైన మానవ మృగాల విషయంలో అయినా, బాధ్యత సమాజానిది కూడా. ప్రభుత్వాలు ఉద్ధరించేస్తాయని ఎదురు చూస్తే.. సమాజం మరింత పతనావస్థని ఎదుర్కోవాల్సి రావొచ్చు.