ప్రజాసమస్యలపై ప్రభుత్వంపై దండెత్తుదామంటే ఏ విధమైన సమస్యలూ కనిపించడం లేదా?
అడపాదడపా ఏవైనా దుస్సంఘటనలు జరిగితే వాటిని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించి అపఖ్యాతి పాలు చేద్దామంటే ఆ యుక్తులు కూడా పారడం లేదా?
రాజకీయ పోరాటం ఎంత చేసినా ప్రజలు పట్టించుకోవడం లేదా?
ఇక జగన్మోహన్ రెడ్డిని ఎలా దెబ్బ తియ్యాలి? పతనమై పోతున్న పార్టీని ఎలా కాపాడుకోవాలి?
ప్రస్తుతం తెలుగుదేశం అధినేత చంద్రబాబును వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరును చూద్దామా…2019 నాటి ర్యాంకులను అధిగమించి ముందుకెళ్ళిపోయిందని నీతి ఆయోగ్ ఒక నివేదికలో పేర్కొన్నది. అభివృద్ధిపధంలో పై ర్యాంకులకు ఎగబాకుతున్నది. ఇక దేశంలోని ముఖమంత్రుల్లో మూడో స్థానం సంపాదించారు జగన్మోహన్ రెడ్డి. ఖాళీ ఖజానాను చేతికిచ్చి పోయినా సంక్షేమపథకాల్లో అగ్రగామిగా ఉన్నది. ఢిల్లీ ఎప్పుడు వెళ్లినా అమిత్ షా కలుస్తున్నారు. గంటల తరబడి మాట్లాడుతున్నారు. పోలవరం రివైజ్డ్ ఎస్టిమేట్ ను కేంద్రం ఆమోదించిందంటున్నారు. ముప్ఫయి ఒక్క లక్షలమందికి ఇళ్ల పట్టాలు లభించాయి. ఈ ఏడాది చివరినాటికి గృహప్రవేశ ముహూర్తాలను కూడా నిర్ణయించారు. అమ్మ ఒడి పధకం కింద ఇస్తున్న డబ్బులు తల్లుల ఖాతాలలో ఠంచనుగా పడుతున్నాయి. రైతు భరోసా పధకం కింద రైతులకు డబ్బులు అందాయి. వృద్ధులకు పెన్షన్స్ సకాలంలో అందుతున్నాయి. నాలుగు లక్షలమంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాయి. కరోనా సమయంలో దేశంలోనే అత్యుత్తమంగా పనిచేసింది ప్రభుత్వం. ఇక ఈరోజునుంచి ఇంటివద్దకు రేషన్ సరుకులు అందించే 9262 వాహనాలను ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నాను. అన్ని వర్గాలవారు సంతృప్తిగా ఉండటంతో ప్రజలు రోడ్లమీదికొచ్చి ప్రభుత్వంతో యుద్ధాలు చేసేంతగా సమస్యలు కనిపించడం లేదు.
మరి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని బ్రతికించుకోవాలంటే ఏమి చెయ్యాలి? ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే కార్యక్రమాలను చెయ్యాలి. ఫలితంగా గత కొన్ని మాసాలుగా దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఆ నిందలు వైసిపి మీద వేస్తున్నారు. అయితే కొంతలో కొంత మెరుగు ఏమిటంటే ప్రజలు తెలుగుదేశం వారి మాటలను నమ్మడం లేదు. దుండగులను పట్టుకోవడానికి ప్రభుత్వం సమర్థులైన పోలీసు అధికారులతో సిట్ ను ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో కొందరు సాక్ష్యాలతో దొరికారు. దుర్గ గుడిలో వెండి సింహాలు కాజేసిన దొంగలు దొరికారు. తాము ఎన్ని గారడీవిద్యలు ప్రదర్శించినా జనం నమ్మకపోతుండటం చంద్రబాబులో అసహనాన్ని రేకెత్తిస్తున్నది. తిరుపతి ఉపఎన్నిక రాబోతున్నది. పార్టీ తరపున ప్రకటించిన అభ్యర్థి పనబాక లక్ష్మి ఏ క్షణానైనా పార్టీ నుంచి జంప్ చేసే అవకాశం కనిపిస్తున్నది. తిరుపతి ఉపఎన్నికలో రెండోస్థానం దక్కకపోతే తెలుగుదేశం పరువు పోవడం ఖాయం. అక్కడ జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే తెలుగుదేశం మూడో స్థానానికి వెళ్ళిపోతుంది. ఆ భయమే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మతతత్వపార్టీగా మార్చుతున్నది. చంద్రబాబు ఆహార్యం కూడా మారిపోతున్నది. నుదుట జెండాకర్రలా పెద్ద బొట్టు తో కనిపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులు. హిందుత్వాన్ని బీజేపీ నుంచి కబ్జా చేసి హిందువులు, ముస్లిములను తన ఖాతాలోకి తెచ్చుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగమే నేటి చంద్రబాబు తలపెట్టిన ధర్మ పరిరక్షణ యాత్రలు అని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.
చంద్రబాబు వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో కాలమే నిర్ణయించాలి.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు