ఊహించని వేళ… ఎల్‌ఓసీ వద్ద దాదాపు వారం రోజులు కొనసాగిన ఘర్షణల తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య అర్థరాత్రి సమయంలో కాల్పుల విరమణ కుదరడం అంతర్గతంగా ఆసక్తికర పరిణామాలకు తెరలేపింది. మే 10న మధ్యాహ్నం వరకు తీవ్రంగా సాగిన దాడుల్లో భారత్ పైచేయి సాధించడంతో… అదే సమయంలో పాక్ వైపు నుంచి ‘విరమణ’ ప్రతిపాదన రావడం విశేషం.
భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌కు… పాక్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా హాట్‌లైన్‌లో కాల్ చేసి విరమణ ప్రతిపాదన పెట్టిన సమయం ఉదయం 9 గంటలు. ఇది ఆదేశాంతర చర్యగా కాకుండా, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో – పాక్ ఆర్మీ చీఫ్ మధ్య జరిగిన సంభాషణకు ఫాలోఅప్ అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా… అదే సమయంలో భారత వైమానిక దళం పాక్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై మిస్సైల్ దాడికి దిగింది. ఇది తమకు ఊహించని పరాభవంగా అనిపించిన పాక్ వెంటనే వెనక్కి తగ్గిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దాడిలో మూడు విమానాలు నాశనమైనట్లు పాక్ స్వయంగా అంగీకరించకపోయినా, స్థానిక పత్రికలు రిపోర్ట్ చేశాయి.
అయితే దీనిపై అమెరికా తరఫున విస్తృతంగా మద్దతుగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. ట్రంప్ ట్వీట్, వాన్స్ ఫోన్ కాల్, కమాండ్ అథారిటీ మీటింగ్ రద్దు – ఇవన్నీ కూడా పాక్ మానసిక స్థైర్యాన్ని తక్కువ చేస్తూ… భారత్ దెబ్బకు దిగమింగేలా చేశాయన్న వాదన వినిపిస్తోంది.
ఇదంతా జరిగేలోగా, అధికారికంగా ప్రధాని మోదీ, అమిత్ షా ఇంకా స్పందించలేదు. రేపటి డీజీఎంఓల సమావేశం తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం.. మొదటగా దాడి చేసిన పాక్, చివరికి కాల్పుల విరమణకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది.