తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ అనేక మలుపులు తిరిగిన నాయకుడు. ఉద్యమ నేతగా, ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకున్న ఆయన, 2022లో కీలక నిర్ణయం తీసుకున్నారు.. టీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించి, పేరు మార్పు చేసి బీఆర్ఎస్‌గా మలిచారు. కానీ ఇదే నిర్ణయం ఆయన రాజకీయ జీవితంలో ఒక మలుపు అయిందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
పేరు మారిన వెంటనే పార్టీ కష్టాలు మొదలయ్యాయి. అధికారం కోల్పోయారు. జాతీయ స్థాయిలో పట్టు సాధిస్తామని భావించిన బీఆర్ఎస్ ప్రాంతీయంగా కూడా వెనుకబడిపోయింది. ఈ మార్పుతో పాటు వచ్చిన రాజకీయ సమస్యలు కూడా విపరీతంగా పెరిగాయి. కవిత వ్యవహారం, ట్యాపింగ్ కేసు, పార్టీ లోపల విభేదాలు ఇవన్నీ కూడా అదే సమయంలో ఉధృతమయ్యాయి. బీ-అక్షరం కేసీఆర్‌కు కలిసిరాలేదనే మాట ఇప్పుడు రాజకీయంగా కాదు, సెంటిమెంటుగా కూడా వినిపిస్తోంది.
వికాసానికి బలమైన పేరు అని భావించిన బీఆర్ఎస్, చివరికి అధికారం కోల్పోయిన పేరు అయింది. బీఆర్ఎస్ ఏర్పడిన ఏడాదిలోనే కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. ఇదే సమయంలో పార్టీలో లోపలి విభేదాలు తీవ్రమవ్వడంతో ‘కుటుంబ కలహాలు’ అంటూ విమర్శలు వచ్చాయి. ప్రజల్లో ఉన్న ‘దిగ్గజ నాయకుడు’ అనే అభిప్రాయం కూడా బలహీనమవుతోంది. పైగా, ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా వెనుకబడింది.
ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగాయా? లేకపోతే పార్టీ పేరు మార్పే అసలు కారణమా? అనేది స్పష్టంగా చెప్పలేం. కానీ ఈ మార్పు తర్వాత ఒకదాని వెంట మరోదానిలా కేసీఆర్‌ను ఇబ్బందులు వెంటాడడం మాత్రం ఒక నిజం. ఇప్పుడు బీఆర్ఎస్ పునర్నామాకే వెళ్లాలా లేకపోతే ఈ సంకెళ్లను చెరిగించేందుకు మరొక కొత్త మార్గం అవసరమా అన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.