ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శేషాచలం అడవుల్లో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు నేరుగా రంగంలోకి దిగారు. ప్రభుత్వాలు మారినా అడ్డుకోలేని ఈ స్మగ్లింగ్‌పై దృష్టి సారించిన పవన్, శుక్రవారం తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని ఆకస్మికంగా పరిశీలించారు.
మామండూరు అటవీ ప్రాంతం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాలుగు కిలోమీటర్లకు పైగా వాహనంలో ప్రయాణించి, రెండు కిలోమీటర్ల మేర కాలినడకన అడవిని పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనిపించే అరుదైన మొక్కలను పరిశీలించి, అటవీ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతాన్ని, వెలిగొండ-శేషాచలం అటవీ సరిహద్దులను, స్వర్ణముఖీ నది ఉద్భవించే ప్రాంతాన్ని పరిశీలించారు. గుంటిమడుగు వాగు ఒడ్డున కూర్చుని, వాగుకు ఇరువైపులా ఉన్న చెట్ల వివరాలు తెలుసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్ కూంబింగ్ వివరాలు, అటవీ సిబ్బంది పనితీరు గురించి ఆరా తీశారు.
మామండూరు అటవీ ప్రాంతం పర్యటన అనంతరం, పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా మంగళంలోని అటవీ శాఖకు చెందిన ఎర్రచందనం గొడౌన్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ ఉన్న మొత్తం 8 గొడౌన్లలోని ఎర్రచందనం లాట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. గొడౌన్లలో ఉన్న ఎర్రచందనం దుంగలను ఏ, బీ, సీ, నాన్-గ్రేడ్ల వారీగా పరిశీలించి, ప్రతి గొడౌన్‌లో రికార్డులు తనిఖీ చేశారు.

ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
“ప్రతి ఎర్ర చందనం దుంగకు ప్రత్యేక బార్ కోడింగ్ మరియు లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదు.”

