Aam Aadmi Party: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బగా మారాయి. గతంలో ప్రజలు విశ్వాసంతో మద్దతిచ్చిన ఆప్ ఈసారి మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రత్యేకించి లిక్కర్ స్కాంలో ఆప్ నేతలపై వచ్చిన ఆరోపణలు, శీష్ మహల్ వివాదం ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ మీద అవినీతి ఆరోపణలే ప్రధానంగా ఎదురు తిరిగాయనే వాదన వినిపిస్తోంది.
2013లో విప్లవాత్మకంగా రాజకీయం ప్రారంభించిన ఆప్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాలను నమోదు చేసింది. 2015లో 67 సీట్లు, 2020లో 62 సీట్లు గెలుచుకుని ప్రజా మద్దతును నిలబెట్టుకుంది. అయితే, ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేజ్రీవాల్ సహా కీలక నేతలు లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్న విషయం ప్రజల నమ్మకాన్ని తక్కువ చేసింది.
ఈ ఒక్క అంశమే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా నెగెటివ్‌గా మారాయి. ముఖ్యంగా కేజ్రీవాల్ అధికార భవనం నిర్మాణానికి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. తాను సాధారణ జీవితాన్ని గడుపుతానన్న కేజ్రీవాల్, అధిక వ్యయంతో భవన మార్పులు చేసుకోవడం ఓటర్లకు ఆగ్రహం కలిగించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ మొత్తం అంశాలను బీజేపీ సరిగ్గా ఉపయోగించుకుంది. లిక్కర్ స్కాం, శీష్ మహల్ వివాదాన్ని ప్రధానంగా ముందుకు తీసుకొచ్చి ప్రచారం చేయడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఎన్నికలు పెద్ద గుణపాఠంగా మారినట్లుగా కనిపిస్తోంది.