ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా వచ్చిన వివిధ సర్వేల ప్రకారం, ఈసారి ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టనున్నారని స్పష్టమైంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం, బీజేపీ 51-60 స్థానాల్లో గెలిచి స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని అంచనా వేయడం ఆసక్తికరంగా మారింది.
ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద షాక్ తగిలినట్లేనని అంచనాలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఆప్ పార్టీ ఈసారి గణనీయమైన స్థానాలు కోల్పోనున్నట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఆప్ గరిష్టంగా 37 స్థానాల్లో గెలవొచ్చని ఏబీపీ మ్యాట్రిజ్ అంచనా వేస్తే, మిగిలిన సంస్థలు 25-31 స్థానాల వరకు మాత్రమే వచ్చే అవకాశముందని చెబుతున్నాయి.
ఇక కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా ఉండొచ్చని సర్వేలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేకపోయిన కాంగ్రెస్, ఈసారి కూడా అదే పరిస్థితిని ఎదుర్కొనే అవకాశముందని తెలుస్తోంది. బీజేపీ మళ్లీ అధికారంలోకి రానున్నట్లు ఒకదానికొకటి భిన్నంగా ఉన్న సర్వేలు అంచనా వేస్తుండటంతో, ఫలితాలపై ఆసక్తి పెరిగింది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పరిశీలిస్తే, కొన్ని సంస్థలు బీజేపీకి 40 స్థానాలకంటే ఎక్కువ వరకూ అంచనా వేయగా, మరికొన్ని 50కి పైగా సీట్లు గెలవొచ్చని అంచనా వేయడం గమనార్హం. ఇక అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
వివిధ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు:
పీపుల్స్ పల్స్:
బీజేపీ: 51 – 60
ఆప్: 10 – 19
కాంగ్రెస్: 0
చాణక్య స్ట్రాటజీస్:
బీజేపీ: 39 – 44
ఆప్: 25 – 28
కాంగ్రెస్: 2 – 3
పీపుల్స్ ఇన్ సైట్:
బీజేపీ: 40 – 44
ఆప్: 25 – 29
కాంగ్రెస్: 01
రిపబ్లిక్ పీమార్క్:
బీజేపీ: 39 – 49
ఆప్: 21 – 31
కాంగ్రెస్: 01
టైమ్స్ నౌ:
బీజేపీ: 39 – 45
ఆప్: 29 – 31
కాంగ్రెస్: 0 – 1
ఏబీపీ మ్యాట్రిజ్:
బీజేపీ: 35 – 40
ఆప్: 32 – 37
కాంగ్రెస్: 0 – 1
పోల్ డైరీ:
బీజేపీ: 42 – 50
ఆప్: 18 – 25
కాంగ్రెస్: 0 – 2