రాబోయే సార్వత్రిక ఎన్నికలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో మరోసారి రికార్డ్ విక్టరీ కొడితే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదని వైసీపీ నేతలు భావిస్తునారు. ఒకటైం లో వైనాట్ 175 అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల పనితీరుని జగన్ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ చేతికి ఐప్యాక్ తాజా రిపోర్ట్ అందిందని తెలుస్తుంది.
అవును అభ్యర్థుల ఎంపికలో అతిజాగ్రత్తలు తీసుకుంటూ.. ఎక్కడా తప్పటడుగులు వేయకుండా చూసుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్. కేవలం గెలుపుగుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని ఫిక్సయ్యారు. కష్టపడినవారికే ఛాన్స్ అని ఇప్పటికే పలుమార్లు నేతలకు స్పష్టం చేశారు. ఈ సందర్భంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఇందులో భాగంగా… అభ్యర్థుల ఎంపిక లోనూ ఈ అంశమే కీలక భూమిక పోషించబోతోందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగైదు సార్లు ఆయన ఎమ్మెల్యేలతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈనేపథ్యంలో కొత్త రిపోర్ట్ టేబుల్ పైకి రావడంతో.. తాజాగా మరో విడత భేటీ కానున్నారట జగన్.
అవును… ఈ నెల 21వ తేదీన ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు సీఎం జగన్. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలతోపాటు నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు పాల్గొననున్నారు. మరి ఈ కీలక సమావేశంలో నాయకులకు జగన్ ఎలాంటి సూచనలు చేయబోతున్నారు.. అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి హింట్స్ ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.