చలికాలం రాగానే మార్కెట్‌లలో ఆకుపచ్చ రంగులో.. తియ్యటి రుచితో మెరిసే సీతాఫలం పండ్లకు ప్రత్యేక డిమాండ్ పెరుగుతుంది. విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతో నిండిన ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. చర్మానికి ప్రకాశాన్ని ఇవ్వడంలోనూ ఇది మిత్రమే. అయితే ఈ పండును అందరూ ఒకే రీతిలో తినకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో ఇది శరీరానికి హానికరంగా మారే అవకాశం ఉంది.
కొంతమందికి సీతాఫలం తిన్న వెంటనే దురద, దద్దుర్లు, చికాకు లేదా శ్వాసలో ఇబ్బంది వంటి అలెర్జీ లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పండును పూర్తిగా మానేయడం ఉత్తమం. సీతాఫలంలో ఉన్న కొన్ని రసాయనాలు అలెర్జీ ప్రతిస్పందనలను ప్రేరేపించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇంకా జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ పండును జాగ్రత్తగా తీసుకోవాలి. ఇందులో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను వేగవంతం చేయడం వల్ల ఉబ్బరం, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా కడుపు నిండిన భావన, గ్యాస్ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ఎక్కువ మొత్తంలో తినడం సిఫార్సు చేయబడదు.
సీతాఫలంలోని గుజ్జు ఆరోగ్యానికి మేలైనదే కానీ దాని విత్తనాలు మాత్రం విషపూరితమైనవి. అవి మింగితే జీర్ణనాళానికి ఇబ్బందులు, వాంతులు, మలబద్ధకం, కడుపులో మండడం వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల ఈ పండును తినేటప్పుడు విత్తనాలను పూర్తిగా తొలగించి జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక అధిక ఇనుము (Iron) స్థాయిలు ఉన్నవారికి సీతాఫలం సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఈ పండు ఐరన్‌కి మంచి మూలం కావడంతో అధికంగా తినడం వల్ల శరీరంలో ఇనుము మోతాదు పెరిగి కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం వంటి సమస్యలు ఉత్పత్తి కావచ్చు. దీర్ఘకాలంలో ఇనుము నిల్వలు అధికమైతే జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సీతాఫలంలో ఉన్న విటమిన్ సి శరీరాన్ని రోగాల నుండి రక్షించడంలో, చర్మ కాంతిని కాపాడడంలో సహాయపడుతుంది. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంటే, కాల్షియం ఎముకల బలానికి మేలు చేస్తుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కానీ ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే మితంగా తీసుకోవడమే కీ.
ఆరోగ్య నిపుణుల సూచన ప్రకారం, రోజుకు ఒక చిన్న సీతాఫలం లేదా సగం పండు మాత్రమే సరిపోతుంది. అధికంగా తినడం వల్ల కలిగే ప్రమాదాలను గుర్తించి మితంగా తీసుకుంటే మాత్రమే దీని నిజమైన ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, అలెర్జీలు లేదా ఇనుము అధిక స్థాయిలు ఉన్నవారు డాక్టర్ సలహాతోనే ఈ పండును తీసుకోవాలి. అందువల్ల సీతాఫలం ఆరోగ్యానికి మేలు చేస్తుంది అని అందరూ అనుకోకుండా, మీ శరీర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా తీసుకోవడం ఉత్తమం. మితమే మంత్రం.. అప్పుడు మాత్రమే ఈ తియ్యటి పండు నిజంగా మిత్రంగా మారుతుంది. (గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని ఆరోగ్య నివేదికల ఆధారంగా రూపొందించింది. వీటిని పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని తెలుగు రాజ్యం ధ్రువీకరించడం లేదు.)
