పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన… తాను కూడా ‘ఐబొమ్మ’ వెబ్సైట్లో ఉచితంగా సినిమాలు చూశానని బహిరంగంగా అంగీకరించారు. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం ద్వారా సమస్య పరిష్కారం కాదని, అసలైన సినిమా మాఫియాను శిక్షించాలని డిమాండ్ చేశారు.
టికెట్ ధరల దోపిడీపై ఆగ్రహం: సినిమా టికెట్ ధరలను రూ.600 నుంచి రూ.700 వరకు పెంచితే సామాన్యులు సినిమాలు ఎలా చూడగలరని నారాయణ ప్రభుత్వాన్ని, చిత్ర పరిశ్రమను ప్రశ్నించారు. “సినిమా వాళ్లు కోట్లు ఖర్చు పెట్టి తీస్తారు.. కానీ టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వం దగ్గర అడుక్కుంటారు. సామాన్య ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వాలు వీరికి సహకరిస్తున్నాయా? కోట్లాది రూపాయలు దోచుకుంటున్న ఈ మాఫియాను ఐబొమ్మ రవి లాంటి వారు దెబ్బకొట్టారు,” అని ఆయన వ్యాఖ్యానించారు.

వ్యవస్థలో మార్పు అవసరం: ఒక ఐబొమ్మ రవిని జైలులో వేస్తే మరో వంద మంది పుట్టుకొస్తారని నారాయణ హెచ్చరించారు. “మావోయిస్టు నేత హిడ్మాను చంపితే వెయ్యి మంది హిడ్మాలు పుడతారు. అలాగే వ్యవస్థలోని లోపాలను సరిదిద్దనంత కాలం రవి లాంటి వారు వస్తూనే ఉంటారు. వ్యవస్థాగత వైఫల్యాల వల్లే యువత తప్పుడు మార్గాల్లోకి వెళ్తున్నారు,” అని ఆయన అభిప్రాయపడ్డారు.
వ్యక్తులను శిక్షించడం కంటే, వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడమే సరైన పరిష్కారమని నారాయణ స్పష్టం చేశారు. ఈ వ్యవస్థే నేరస్తులను సృష్టిస్తోందని, సినిమా మాఫియా ఆగడాలను అరికట్టకపోతే భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతాయని ఆయన పేర్కొన్నారు.

