కరోనా వ్యాక్సిన్.. దేశంలో ప్రజలందరికీ ఓ హక్కుగా అందాల్సి వుంది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఇది నిష్టుర సత్యం. వ్యాక్సినేషన్ కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందిస్తున్నాం.. అని గొప్పలు చెప్పుకోవడం కాదు, దేశ ప్రజలందరికీ ఎలాంటి వివక్షా లేకుండా వ్యాక్సిన్ అందించగలగాలి. కానీ, కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్, కొంతమందికి కరోనా వ్యాక్సిన్ ఉచితం అంటూ, ఇంకొందరికి మాత్రం కరోనా వ్యాక్సిన్ వేసినందుకు డబ్బులు వసూలు చేసేలా వ్యాక్సిన్ విధానం తీసుకొచ్చింది.
కేంద్రానికి 150 రూపాయలకే ఓ డోసు వ్యాక్సిన్ అందిస్తున్న సీరం సంస్థ ( కోవి షీల్డ్ వ్యాక్సిన్ నిమిత్తం), రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయలకు విక్రయించడమేంటి.? ప్రైవేటు సంస్థలకు (ఆసుపత్రులకు) 600 రూపాలయకు విక్రయించడమేంటి.? ఈ విషయమై కాంగ్రెస్ నేత సోనియాగాంధీ, కేంద్రంపై మండిపడ్డారు. వ్యాక్సిన్ విధానం వివక్షాపూరితంగా వుందంటూ సోనియాగాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
ఇప్పటికే తెలంగాణ మంత్రి కేటీఆర్, కేంద్రం తీరుని తీవ్రంగా తప్పు పట్టిన విషయం విదితమే. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా వ్యాక్సిన్ ధరల విషయమై కేంద్రంపై దుమ్మెత్తిపోశారు. క్రమంగా ఇదొక రాజకీయ వివాదంగా మారుతోంది. నిజానికి, రోజూ 2 వేల మంది కరోనా బారిన పడి చనిపోతున్నరాంటే చిన్న విషయం కాదు. 3 లక్షల మంది కొత్తగా ప్రతిరోజూ కరోనా బారిన పడుతున్నారు. దీన్ని నేషనల్ ఎమర్జన్సీగా భావించాలి.
సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయినా, కేంద్రం మాత్రం వివక్ష వీడటంలేదు. అందరికీ వ్యాక్సిన్.. అదీ ఉచితంగా.. అని కేంద్రం ఇప్పటికైనా ప్రకటించాలి. ఇప్పుడున్న విధానాన్నే కొనసాగిస్తే, ఖర్చు చేయగలిగినవాళ్ళు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇబ్బంది ఏమీ వుండదు. ఏదిఏమైనా, ప్రధాని మోడీ చెప్పే మాటలకీ, చేసే చేతలకీ పొంతన లేకపోవడం అస్సలేమాత్రం సమంజసం కాదు.