ట్రంప్ ట్రంక్ పెట్టెను సర్దుకుని శ్వేతభవనాన్ని ఖాళీ చెయ్యక తప్పేట్లు లేదు. ఆయన ప్రత్యర్థి జో బైడెన్ వైట్ హౌస్ గృహప్రవేశానికి చేరువలో ఉన్నాడు. కోర్టుల్లో కూడా ట్రంప్ పిటీషన్లను పరిగణనలోకి తీసుకోవడం లేదు. బైడెన్ అమెరికా అధ్యక్షుడు కావడం లాంఛనమే.
అమెరికా ఎన్నికలను గూర్చి భాజపా అధ్యక్షుడు నడ్డా “కరోనాను ఎదుర్కోవడంలో వైఫల్యం చెందడమే ట్రంప్ ఓటమికి కారణం” అంటూ సెలవిచ్చారు. మన మోడీగారు అమెరికా వెళ్లి “మరొక్కమారు ట్రంప్ రావాలి” అని నినదించినా అక్కడి భారతీయులు పట్టించుకోలేదు పాపం! అలాగే ట్రంప్ ను గుజరాత్ పిలిపించి నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని కోలాహలంగా నిర్వహించినా ఫలితం శూన్యం.
కరోనాను ఎదుర్కోవడంలో ట్రంప్ వైఫల్యం చెందిన మాట నిజమే కావచ్చు. కానీ, మోడీ మాత్రం చేసింది ఏముంది? గత డిసెంబర్ లోనే కరోనా ముప్పు మొదలైనప్పటికీ, అది భారతదేశంలో వ్యాపించకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా, విదేశీ రాకపోకలను నియంత్రించకుండా మోడీ పూర్తి నిర్లక్ష్యం వహించారు. కరోనా వైరస్ తీవ్రతను ఏమాత్రం అంచనా వెయ్యకుండా కరోనా ఉధృతంగా ఉన్న సమయంలోనే అమెరికా అధ్యక్షుడి పర్యటనను లక్షలాదిమందితో ఆర్భాటంగా నిర్వహించి ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టారు. చప్పట్లు కొట్టాలని, దీపాలు పెట్టాలంటూ ప్రజలను మభ్యపెట్టారు. ఇక కొందరు మంత్రులయితే ఆవుమూత్రం తాగితే కరోనా రాదని, బురదలో పడుకుంటే రాదని రకరకాలుగా వ్యాఖ్యలు చేసి జోకర్లు అనిపించుకున్నారు. వలస కార్మికుల విషయంలో మోడీ పరమఘోరంగా విఫలం అయ్యారు. రోజుకు పది ఇరవై కేసులు, ఒకటి రెండు మరణాలు ఉన్న సమయంలో సుదీర్ఘ లాక్ డౌన్ విధించి దేశ ఆర్ధిక వ్యవస్థను నేలమట్టం చేశారు. రోజూ వేలాది మరణాలు సంభవిస్తున్నపుడు లాక్ డౌన్ నిబంధనలను క్రమేణా ఎత్తివేశారు. రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి దిగజారిపోయినపుడు కనీసం వారికి ఏమాత్రం ఉపశమనం కలిగించలేకపోయారు. కరోనాను ఎలా ఎదుర్కోవాలో ఒక ప్రణాళికను రచించడంలో మోడీ పూర్తిగా విఫలం చెందడం వలన లక్షలాదిమంది ఉపాధిని కోల్పోయారు. చైనా లాంటి దేశాలు కేవలం నాలుగైదు రోజుల వ్యవధిలో ఆసుపత్రులను నిర్మించి కరోనా రోగులకు సేవలు అందిస్తూ మరణాలను కంట్రోల్ చేస్తుంటే మోడీ మాత్రం కనీసం ఒక్క ఆసుపత్రిని కూడా నిర్మించలేకపోయారు. మనదేశస్తుల శరీరసౌష్టవం కానివ్వండి, ఆహారపు అలవాట్లు కానివ్వండి, మన వాతావరణం కానివ్వండి మనదేశంలో మరణాలు తక్కువగా నమోదయ్యాయి తప్ప మోడీ చేసింది ఏమీ లేదు. సాక్షాత్తూ కొందరు కేంద్రమంత్రులు కూడా కరోనా పాలయ్యారు. కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి కూడా కరోనాతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. గోమూత్రం తాగమని సలహా ఇచ్చిన మంత్రులు తమకు కరోనా సోకినప్పుడు పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో చేరిపోయారు అంటూ సోషల్ మీడియాలో హేళనలు కూడా ధ్వనించాయి. మహా భయంకరమైన వైరస్ దేశం మొత్తం విస్తరించినపుడు పౌరుల భద్రతకు సరైన హామీ కూడా మోడీ ఇవ్వలేకపోయారన్నది యదార్ధం. వాక్సిన్ ఎప్పుడు వస్తుంది అన్న విషయంలో కూడా మోడీ ప్రజలను తప్పుదోవ పట్టించారు.
వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా మోడీ తీసుకున్న చర్యల కారణంగా కరోనా తగ్గిందని భాజపా అధ్యక్షుడు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. మోడీ అదృష్టం ఏమిటంటే సార్వత్రిక ఎన్నికలు ముగిసి మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఎనిమిది మాసాలకు కరోనా రాబట్టి మోడీ అదృష్టవంతుడు అయ్యారు. ఈ సమయంలో భారతదేశంలో కూడా ఎన్నికలు వచ్చినట్లయితే మోడీ పరమఘోరంగా పరాజయం చెందేవారు. ట్రంప్ కొద్ది తేడాతో మాత్రమే ఓడిపోయారు. మోడీకి కనీసం డిపాజిట్లు కూడా వచ్చేవి కావు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు