కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఇప్పటికే సామూహిక వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. భారతదేశంలో కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు ఇప్పటికే రెండు కంపెనీలకు అనుమతులు కూడా జారీ అయ్యాయి. ఆ రెండు కంపెనీలు తమ తమ వ్యాక్సీన్లను పది పదిహేను రోజుల్లోనే అందుబాటులోకి తెచ్చే అవకాశం వుంది. అత్యవసర వినియోగం కింద ఈ వ్యాక్సీన్లను దేశవ్యాప్తంగా ప్రజలకు అందించనున్నారు. అయితే, వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితం.? అన్నదానిపై పలు అనుమానాలు ఇంకా అలాగే వున్నాయి. వ్యాక్సిన్‌ని ఇంత తక్కువ సమయంలో అందుబాటులోకి తీసుకురావడమంటే, ప్రజారోగ్యం విషయంలో రాజీ పడినట్లేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అదంతా దుష్ప్రచారమేనని కేంద్రం చెబుతోంది.
వ్యాకి్సన్ పూర్తిస్థాయిలో సురక్షితమైనదనీ, సమర్థవంతమైనదనీ తేలాకనే, దానికి ఆమోద ముద్ర వేశామన్నది కేంద్రం వాదన. అయితే, ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ సహా, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలే ముందుగా వ్యాక్సిన్ తీసుకోవాలనీ, వారిపై వ్యాక్సిన్ విజయవంతమయ్యాకనే, ప్రజలకు ఇవ్వాలనీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇండియాలో ఏదైనా సాధ్యమే. విదేశాల్లో వ్యాక్సీన్లకు ఆమోదం లభించినప్పుడు.. అక్కడ ఈ తరహా రాజకీయాలు నడవలేదు. ఇక్కడి పరిస్థితులు వేరు. అయితే, విదేశాల్లో వ్యాక్సిన్‌కి సంబంధించి జరిగే పరీక్షలు, వాటి ఫలితాలు..
అక్కడి వ్యవహారం వేరేలా వుంటుంది. మన దేశంలోనూ అంత పక్కగా వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరిగాయా.? అన్నదానిపైనే అనుమానాలన్నీ. ఎవరి గోల ఎలా వున్నా, సంక్రాంతి తర్వాత ఏ క్షణమైనా, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైపోతుంది. ఆ వ్యాక్సిన్ సమర్థత ఎంత.? అనేది, దాదాపుగా ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఓ స్పష్టత వచ్చేస్తుంది. ఈలోగా విపక్షాల రాజకీయం అనవసరం. కానీ, వ్యాక్సిన్ నుంచి దుష్పరిణామాలు తలెత్తితే మాత్రం.. తద్వారా జరిగే నష్టం అంచనాలకు అందదు. బహుశా విపక్షాల ఆందోళన ఇదేనేమో. ఏదిఏమైనా, కరోనా వైరస్‌కి సరైన మందు ఇంకా కనుగొనకముందే, వ్యాక్సిన్ రావడం, ఆ వ్యాక్సిన్ చుట్టూ ప్రపపంచ వ్యాప్తంగా లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుండడం.. చాలా చాలా చాలా అనుమానాలకు తావిస్తూనే వుంది.