రాహుల్ గెట్ రెడీ!

కాంగ్రెస్ పార్టీకి.. రాహుల్ గాంధీకి ఇది పరీక్షా సమయం. నిజానికి 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము మల్లె ఉండిపోయింది. పదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీని తిప్పికొట్టి ఎన్డీయే కూటమికి అధికారం అప్పగించిన దేశప్రజలు మళ్ళీ 2019లో కూడా మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి అఖండ విజయంతో అధికారం కట్టబెట్టారు.

2014 కి ముందు 2004 నుంచి పదేళ్ల పాటు కేంద్రంలో వరసగా రెండుసార్లు అధికారం చెలాయించిన కాంగ్రెస్ 2014 ఎన్నికలతో కుదేలైపోయింది. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా అద్భుతాలు సృష్టించిన మన్మోహన్ సింగ్ పదేళ్ల కాలంలో ప్రధానిగా తన మార్కును చూపించలేకపోయారు.  ఆయన బాధలు ఆయనవి. ఇప్పుడు మన కథనం మన్మోహన్ గురించి కాదు. ఆయనది ఇంచుమించు ముగిసిపోయిన కథ.మనం మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ గురించి.. ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ గురించి..!

సరే..మోడీ అంటే కాస్త మొహం మొత్తి కావచ్చు..ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్ పాలనను భరించాం.. ఇప్పుడు వరసగా పదేళ్ల పాటు మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుకు అవకాశం ఇచ్చాం.. మళ్ళీ ఓసారి కాంగ్రెస్ పార్టీకి ఇస్తే పోలా.. అనుకున్నారో ఏమో..దేశ ప్రజల్లో ఓ మోస్తరు శాతం..మొన్నటి ఎన్నికల్లో లోకసభలో ఇందిరమ్మ పార్టీకి గణనీయమైన సంఖ్యాబలాన్ని ఇచ్చి మళ్ళీ ఊపిరి నింపారు. ఇప్పటికే పెద్ద రాష్ట్రాలు కొన్ని బిజెపి చేజారాయి..కేంద్రంలో స్థానాలు తగ్గాయి.. వచ్చే ఎన్నికల నాటికి ఎలా ఉంటుందో మరి..!

2029 ఎన్నికలు ఎటూ రాహుల్..మోడీ మధ్య జరిగేది ఉండకపోవచ్చు..బిజెపి మరోసారి మోడీ బొమ్మ పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళేది ఉండదు.అసలు..ఈ దఫా మోడీని అయిదేళ్ల పాటు కొనసాగించడమే కష్టం. కనుక వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా బిజెపి ముఖచిత్రం మారుద్ది..!

కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీని మార్చే సీన్ ఉండదు. అంటే 2029 ఎన్నికలకు కూడా హస్తం పార్టీ ఇందిరమ్మ మనవడి బొమ్మతోనే ఎన్నికలకు వెళ్ళడం ఇంచుమించు ఖాయం.. ఇప్పుడిక బాధ్యత రాహుల్ మీదే ఉంటుంది. ఆయన మరింతగా పదునుదేరాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే రాహుల్ ఇప్పుడు కాస్త పరిపక్వంగానే కనిపిస్తున్నారు. అయితే ఒక్కో మార్పు కోసం అంత వ్యవధి తీసుకుంటే ఎక్కాల్సిన రైలు 2029 లో కూడా తప్పిపోతుంది. ఇక నుంచి రాహుల్ తనను తాను మెరుగుపరచుకునే ప్రక్రియను వేగవంతం చేసుకోవాలి. అంతా ఆయన చేతుల్లోనే ఉంది..!

పట్టుదలే ఉంటే కాగలడు మరో ప్రధాని.. నెహ్రూ కుటుంబం నుంచి ఈ దేశానికి..నంబర్ ఫోర్..!