కేసిఆర్ ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ షాకింగ్ స్కెచ్

తెలంగాణలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్  అత్యంత వ్యూహాత్మక అడుగులు వేస్తున్నది. గులాబీ దళపతి కేసిఆర్ వేసిన ఎత్తుగడను తమకు అనుకూలంగా వాడుకుని దేశవ్యాప్తంగా పట్టు సాధించే దిశగా కసరత్తు చేస్తున్నది. కేసిఆర్ తన ప్రయోజనాల కోసం వేసిన ముందస్తు స్టెప్ ను తమకు అనుకూలంగా మార్చుకుని తెలంగాణ ఎన్నికలను ప్రీ ఫైనల్ గా మలచుకోవాలన్న ఆలోచనలో ఉన్నది. అందుకోసమే టిఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగేలా స్టెప్ వేయనున్నట్లు బుధవారం నాటి పరిణామాలను చూస్తే అర్థమవుతున్నది. ఇంతకూ కాంగ్రెస్ హైకమాండ్ స్కెచ్ ఎలా ఉంది. ఏ మేరకు వర్కవుట్ అవుతుంది? అంతగా కేసిఆర్ ను ఇరకాటంలో పెట్టే ఆ స్టెప్ ఏంటి? చదవండి స్టోరీ.

ప్రజల్లో వ్యతిరేకత పెరగకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరో ఐదేళ్ల పాటు అధికారాన్ని గుప్పిట పట్టాలన్న ఉద్దేశంతో కేసిఆర్ అకస్మాత్తుగా అసెంబ్లీని రద్దు చేసుకున్నారు. ఒకవైపు జాతకాలు, సంఖ్యా శాస్త్రం, జ్యోతిష్యం, జన్మ నక్షత్రాలను విశ్వసించే కేసిఆర్ ఆ క్రమంలోనే అసెంబ్లీ రద్దుకు పూనుకున్నారు. ఈ పరిస్థితుల్లో కేసిఆర్ ను అధికారానికి దూరం చేసే క్రమంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. తొలిసారి తెలుగు నేల మీద తన ప్రధాన ప్రత్యర్థి అయిన టిడిపితో జట్టు కట్టాలని నిర్ణయించింది. అంతేకాకుండా కోదండరాం నాయకత్వంలోని జన సమితి, చిరకాల స్నేహం ఉన్న సిపిఐ తోనూ మహా కూటమి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నది. సీట్ల పంపకాలపై కసరత్తు జరుగుతున్నది.

ఈ తరుణంలోనే బుధవారం పిసిసి కొత్త కమిటీలను నియమించింది. ఇందులో కొన్ని పదనిసలు చోటు చేసుకోవడం కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొనేలా చేసింది. టిఆర్ఎస్ లో చేరిన మాజీ స్పీకర్ కె ఆర్ సురేష్ రెడ్డిని సైతం కమిటీలో చోటు కల్పించి తన మార్కును చూపించింది. ఈ విషయం పిసిసికి మింగుడుపడని అంశంగానే ఉన్నది. అయితే ఈ కమిటీల్లో ఇద్దరు పెద్ద లీడర్లకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు. ఈ పరిణామమే రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ను సమర్థవంతంగా ఎదుర్కొని అధికారం నుంచి తరిమేయాలన్న కసితో ఉన్నట్లు చెబుతున్నారు.

అదేమంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దళిత సిఎం దిశగా అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతున్నదని కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత (అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు కలిగిన నేత) ఒకరు ‘‘తెలుగురాజ్యం’’ కు తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం దళిత సిఎం అనే కాన్సెప్ట్ తోనే ఈ దఫా ఎన్నికలను ఎదుర్కొనేందుకు రెడీ అయిందని ఆయన చెప్పుకొచ్చారు. అందుకోసమే తెలంగాణ లో ఇద్దరు పెద్ద దళిత లీడర్లకు కీలక బాధ్యతలు కట్టబెట్టారని చెప్పారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ్మ కు మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. అలాగే మరో కీలక నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ అయిన మల్లు బట్టి విక్రమార్కకు ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. దీన్నిబట్టి చూస్తే రానున్న ఎన్నికల్లో దళిత సిఎం ఎజెండాతోనే ఎన్నికల రంగంలోకి దిగాలని చూస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

నిజానికి దళిత సిఎం అనే కాన్సెప్ట్ కేసిఆర్ తెలంగాణ ఉద్యమ కాలంలో బలంగా ముందుకు తీసుకొచ్చారు. తెలంగాణ వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అవుతాడని, తాను, తన కుటంబానికి పదవులే అక్కర లేదని వందల సభల్లో కేసిఆర్ ప్రకటించారు. అంతేకాదు తాను తల నరుక్కుంటాను కాని మాట తప్పను అని అనేక సందర్భాల్లో దళితులకు హామీ ఇచ్చారు. అయితే కేసిఆర్ ఆ విషయాన్ని మేనిఫెస్టోలో మాత్రం పొందుపర్చలేదు. టిఆర్ఎస్ గెలిచిన తర్వాత కేసిఆర్ సిఎం అయ్యారు. ఆయన తనయుడు కేటిఆర్ మంత్రి, అల్లుడు హరీష్ రావు మరో మంత్రి అయ్యారు. తర్వాత కాలంలో సడ్డకుడి కొడుకు అయిన సంతోష్ రావును రాజ్యసభకు ఎంపిక చేశారు. అంతకుముందే నిజామాబాద్ ఎంపిగా కూతురు కవితను గెలిపించుకున్నారు.

ఈ పరిస్థితుల్లో కేసిఆర్ నినదించి వదిలేసిన దళిత సిఎం నినాదాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భుజాలకెత్తుకునే పరిస్థితి కనబడుతున్నది. తద్వారా కాంగ్రెస్ కేసిఆర్ ను సక్కెస్ ఫుల్ గా ఎదుర్కోవాలన్న ఉద్దేశంలో ఉంది. తెలంగాణలో దళిత ఓటు బ్యాంకు గణనీయంగా ఉంది. మాదిగ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకే ఉంటూ వచ్చింది. కానీ 2014 ఎన్నికల్లో దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లాంటి పథకాలను తెస్తామని కేసిఆర్ హామీ ఇవ్వడంతో దళితులంతా కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ వైపు కదిలారు. కానీ దళితులకు టిఆర్ఎస్ సర్కారు నమ్మించి మోసం చేసిందన్న ఉద్దేశంలో కాంగ్రెస్ ఉంది.

దళిత సిఎం అనే విషయంలో టిఆర్ఎస్ మాట తప్పడం, దళితులకు మూడెకరాల భూమి విషయంలో పెద్దగా దళితులకు మేలు జరగలేదని కాంగ్రెస్ అంచనాల్లో ఉంది. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లాంటివి కూడా దళితులకు రాలేదని ఆ పార్టీ చెబుతున్నది. అందుకే కేసిఆర్ మాట ఇచ్చి మోసం చేసిన దళిత సిఎం కాన్సెప్ట్ ను తాము విజయవంతంగా అమలు చేస్తామన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఎన్నికల కమిటీలను నియమించిందని ఆ లీడర్ వివరించారు. పైగా నేరెళ్లలో దళితులపై దాడులు, థర్డ్ డిగ్రీ ప్రయోగించి కొందరు దళిత యువకులను సంసారాలకు పనికిరాకుండా పోలీసుల చేత చిత్రహింసలకు గురి  చేశారని కాంగ్రెస్ తన ప్రచారంలో చెప్పి దళిత ఓటు బ్యాంకును గుండుగుత్తగా తమవైపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉందని చెబుతున్నారు.

దీనివల్ల కాంగ్రెస్ రెండు ప్రధాన వర్గాలను తనవైపు తిప్పుకునే చాన్స్ ఉందని అంటున్నారు. ఒకటి దళిత ఓటు బ్యాంకు విజయవంతంగా కాంగ్రెస్ ఖాతాలో పడుతుంది. అలాగే రెడ్డి సామాజికవర్గం కూడా కాంగ్రెస్ వైపే ఉంటుందని కాంగ్రెస్ భావిస్తున్నది. తెలంగాణలో కేసిఆర్ ప్రకటించిన 105 సీట్లు 35 సీట్లు రెడ్డి సామాజికవర్గానికి కట్టబెట్టారు. అయినప్పటికీ తెలంగాణ రెడ్డీలంతా కేసిఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారని కాంగ్రెస్ అంచనాల్లో ఉంది. అందుకే రెడ్డీలంతా కాంగ్రెస్ వైపు ఉంటారని నమ్ముతున్నది. ఇటు రెడ్డి, అటు దళిత వర్గాలు కాంగ్రెస్ కు వచ్చేస్తే టిఆర్ఎస్ ను ఎదుర్కోవడం కష్టం కాదన్నది కాంగ్రెస్ అంచనా అని చెబుతున్నారు.

దాంతోపాటు టిఆర్ఎస్ ఎన్నిసార్లు గెలిచినా కేసిఆర్ ఫ్యామిలీవారే సిఎం అవుతారు తప్ప మరొకరు కాలేరు అన్న ప్రచారాన్ని చేపట్టనున్నారు. కానీ కాంగ్రెస్ గెలిస్తే ఒక దళితుడు సిఎం కావొచ్చు అన్నది నిరూపిస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ తొలి సిఎం దళితుడు కాకపోయినా మలి సిఎంగా దళితుడిని చేయడం తమ బాధ్యత అని భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు.

మొత్తానికి ముల్లును ముల్లుతోనే తీయాలన్న ఉద్దేశంతో టిఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు పకడ్బంధీ వ్యూహం అమలు చేసే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి జనాలు ఏమేరకు రిసీవ్ చేసుకుంటారన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న.