రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే షురూ అయ్యింది. వివిధ దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా వున్న భూముల లెక్కల్ని తీయనున్నారు. భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా, భూముల సర్వే నిర్వహిస్తామనీ.. దేశంలోనే ఏ రాష్ట్రమూ చేపట్టని ఓ అద్భుతమైన కార్యక్రమం ఇదని వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతోన్న విషయం విదితమే. ఎలా చూసినా ఈ సమగ్ర భూ సర్వే అనేది చాలా చాలా గొప్ప ఆలోచనే. అయితే, సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం, వైఎస్ జగన్ ప్రభుత్వ ఆలోచనలో ‘అవినీతి కోణాన్ని’ చూస్తున్నారు.
సముగ్ర భూ సర్వే జరిగితే, అందులో ప్రభుత్వం అవినీతి చేయడానికేముంటుంది.? సరే, ఈ సర్వే కోసం దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఖర్చు అవసరమా.? అన్నది వేరే చర్చ. ఈ క్రమంలో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందా.? అంటే, దానిపై విపక్షాలు ఆరోపణలు చేస్తే.. అందులో కాస్తో కూస్తో అర్థం వుంది. కానీ, సర్వే పేరుతో ఆరు రకాల భూములపై వైఎస్ జగన్ కన్నేశారంటూ చంద్రబాబు సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భూముల లెక్కలు పక్కాగా తేలుతున్నప్పుడు.. ఫలానా భూమి ఎవరిది అన్న అవగాహన ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. అన్నిటికీ లెక్కలు పక్కాగా వుంటాయ్ మరి. ఆ తర్వాత ఎవరైనాసరే, ‘దాపరికం’ చేయడానికి వీలు పడదు. ఇక్కడ, రాజకీయ నాయకులకే అది తలనొప్పి వ్యవహారం. ఎందుకంటే, రాజకీయ నాయకులు బినామీల పేర్లతోనే భూముల్ని కొంటుంటారు..
వారి ఆస్తుపాస్తులు బినామీల చేతుల్లోనే వుంటుంది. సమగ్ర భూ సర్వే.. అంటూ జరిగితే, బినామీ వ్యవహారాలకూ ఆస్కారం తగ్గుతుంది. ఎవరి పేరుతో ఎక్కడ ఎంతెంత భూమి వుంటుందో తేలిపోతుంది కాబట్టి.. రాజకీయ నాయకుల బండారం పూర్తిగా బయటపడిపోయినట్లే. నిజానికి, 2014 – 2019 మధ్య ఆంధ్రప్రదేశ్ లూటీ అయ్యిందనే విమర్శలున్నాయి. ప్రధానంగా ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ బూమ్ అనూహ్యంగా పెరిగింది. అదిగో రాజధాని, ఇదిగో ఎయిర్ పోర్ట్.. అంటూ టీడీపీ నేతలు చేసిన యాగీ అంతా ఇంతా కాదు. ఆ దొంగ లెక్కలనీ, ఇప్పుడు సమగ్ర సర్వేలో తెరపైకొస్తాయి. ఇదీ వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్. అయితే, ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో.. రాజకీయ నాయకులపై ‘చర్యలు’ అనేది హాస్యాస్పదమైన అంశమే. కేవలం కక్ష సాధింపు రాజకీయాలు తప్ప, నిఖార్సుగా నిందితులకు శిక్షలు పడే పరిస్థితులు వున్నాయా.? ప్రభుత్వాల్లో అంత చిత్తశుద్ధి వుంటుందా.? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే.