CM Revanth Reddy: ‘మొంథా’ తుపానుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుపాను కారణంగా తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను తీవ్రత, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆయన ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నివారించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.

రైతులు, ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత : ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్న నేపథ్యంలో, కళ్లాల్లో ఆరబోసిన ధాన్యానికి నష్టం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ వర్షం నుంచి పంటను కాపాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

రైల్వే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు: తుపాను కారణంగా మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, గుండ్రాతిమడుగు స్టేషన్ల వద్ద రైళ్లు నిలిచిపోవడం, కొన్ని రైళ్లను దారి మళ్లించిన నేపథ్యంలో, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం రైల్వే అధికారులను ఆదేశించారు.

జిల్లా యంత్రాంగానికి కీలక సూచనలు: వర్షాలు అధికంగా ఉన్న జిల్లాల్లో సహాయక చర్యల కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF), ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాలు సమన్వయంతో పనిచేయాలని, జిల్లా కలెక్టర్లు వీరికి మార్గదర్శకత్వం వహించాలని సీఎం ఆదేశించారు.

జల వనరులు: వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించే ప్రమాదం ఉన్నందున, లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సహాయక శిబిరాలకు తరలించాలి. నీటి పారుదల శాఖ అధికారులు నిరంతరం రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాలను పర్యవేక్షించాలి. పూర్తిగా నిండిన జలాశయాల వద్ద ముందుగానే ఇసుక బస్తాలను సిద్ధం చేసుకోవాలి.

రవాణా నిలిపివేత: లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేలు, రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో రాకపోకలను పూర్తిగా నిషేధించాలని ఆదేశించారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సూచించారు.

వైద్యం, పారిశుద్ధ్యం: నీరు నిల్వ ఉండటం వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, నగర, పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. వైద్యారోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచి, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి : రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, పోలీస్, అగ్నిమాపక దళాలు సహా అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు GHMC, హైడ్రా, SDRF సిబ్బంది తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Cyclone Montha: Present Situation In Kakinada | Telugu Rajyam