YS Jagan: జగన్‌.. పదేపదే హోదా జపం ఎందుకు?

వైయస్సార్సీపి అధ్యక్షుడు జగన్ పంతం సరైనదేనా?

తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన పదే పదే అడగడం కరెక్టేనా?

ప్రభుత్వంలోని పెద్దలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ హోదా ఇవ్వబోము అని తెగేసి చెప్పినా ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏమిటి?

ఓ పక్క ఈ అంశంపై కోర్టుకు వెళ్లిన జగన్ హోదా కోసం పంతం పట్టడం ఏమిటి?

ఈ విషయంలో జగన్ పార్టీ జనంలో చులకన అవుతోందా?

ఎస్…ముమ్మాటికి చులకన అవుతోంది అంటున్నారు జనం.

ఏపీ అసెంబ్లీలో తగిన సంఖ్యాబలం లేని వైఎస్సార్‌ సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని స్పీకర్‌, కూటమి ప్రభుత్వ పెద్దలు తెగేసి చెబుతున్నా తమకు హోదా ఇవ్వాలని మాజీ సీఎం జగన్‌ పదే పదే అడగడం సబబుగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకపక్క ఈ విషయమై కోర్టుకు వెళ్లిన జగన్‌ తరచుగా తమకు హోదా ఇవ్వండని డిమాండ్‌ చేయడం ఎందుకు? పైగా హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి రాబోమని చెప్పడం జనంలో ఆ పార్టీకి నెగిటివ్‌గా పరిణమిస్తోంది.

తాజాగా బుధవారం కూటమి ప్రభుత్వ బడ్జెట్‌పై విమర్శలు చేసిన జగన్‌.. తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై ప్రభుత్వాన్ని, స్పీకర్‌ను తప్పుబడుతూ మాట్లాడారు. దీనిపై ఎప్పటిలాగే అటు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఇటు కూటమి నాయకులు జగన్‌పై విమర్శల దాడి చేశారు. జగన్‌ నియమ నిబంధనలు తెలియకుండా మాట్లాడడమే కాక, స్పీకర్‌ స్థానాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని, అయినా ఆయనను క్షమించి వదిలేస్తున్నానని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. 10 శాతం సభ్యులు లేకుండా వైఎస్సార్‌ సీపీకి నిబంధనలకు విరుద్ధంగా ఎలా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తామని ఆయన ప్రశ్నించారు. మంత్రి లోకేశ్‌ అయితే.. జగన్‌ సభకు వచ్చి స్పీకర్‌ కేటాయించిన స్థానంలో కూర్చుని ప్రజాసమస్యలపై చర్చించాలే తప్ప ఇలా తమకు హోదా ఇవ్వాలని రాద్ధాంతం చేయడం తగదని అన్నారు. శాసనసభలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ జగన్‌ తనకు లేని హోదాను కావాలని కోరుతున్నారన్నారు. స్పీకర్‌పై దుష్ప్రచారం చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కూటమిలోని ఇతర నాయకులు కూడా జగన్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

ఇంతమంది నాయకులు ఒక్కుమ్మడిగా తనపై దాడి చేసే అవకాశాన్ని జగనే చేజేతులా కూటమి నాయకులకు ఇస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని చెప్పడం, సభలో తనకు ఎంత సమయం ఇస్తారు ఇప్పుడే తేల్చాలని కండిషన్ పెట్టడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. సభలో తమకు ఎంత సమయం కేటాయిస్తారన్న అంశంపై ఏ నాయకుడూ సభ బయట చర్చ పెట్టడం ఇంతవరకు చూడలేదు. హోదా ఇస్తే గాని సభకు వెళ్లను అని చెప్పడం ద్వారా జగన్ తనను ఎన్నుకున్న ప్రజలను అగౌరవపరిచినట్టు అవుతోందని రాజకీయ పరిశీలకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

స్పీకర్ హోదా ఇవ్వకపోయినా, సభలో తన కోరినంత సమయం ఇవ్వకపోయినా అక్కడే ఇష్యూ చేయాలి తప్ప సభ బయట మాట్లాడ్డం బాగాలేదంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది స్పీకర్ విచక్షణాధికారానికి సంబంధించిన అంశం. అలాగే వివిధ అంశాలపై ప్రసంగించేటప్పుడు ఏ సభ్యుడికి ఎంత సమయం కేటాయించాలి అన్నది కూడా స్పీకర్ విచక్షణ అధికారమే. కేవలం ముగ్గురు సభ్యులు ఉన్న భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ అసెంబ్లీలో అక్కడ స్పీకర్ ప్రతిపక్ష హోదా ఇచ్చారు. 10 శాతం నిబంధనను ఆయన పట్టించుకోలేదు. అది ఆయన విచక్షణ. అదే విధంగా ఇక్కడ కూడా ఇవ్వాలి అని అడగడం వేరు. పట్టు పట్టడం వేరు. పట్టు పట్టడం దగ్గరే జగన్ ఆగిపోయారు అన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. పైగా మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష హోదా ఇవ్వబోము అని ఖరాకండిగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా తేల్చి చెప్పాక ఆ విషయంలో మంకు పట్టు పడితే ప్రయోజనం ఉంటుందా అని జనం అనుకుంటున్నారు.

ఈ విషయంపై కోర్టుకు వెళ్లిన జగన్… తీర్పు వచ్చే వరకు హోదా గురించి మాట్లాడకపోవడమే మంచిది అని సూచనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో తమ వాణిని వినిపిస్తారు అని జనం నమ్మి ఓట్లు వేస్తే అసలు సభకే వెళ్లకుండా పంతాలకు పోవడం సరి కాదని ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుతున్నారు. రాష్ట్రంలో జనం ఎదుర్కొంటున్న సమస్యల సవాలక్ష ఉండగా వాటి గురించి చర్చించడం మాని, రాని ప్రతిపక్ష హోదా కోసం బయట ఫైట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సభలో ప్రజా సమస్యలపై చక్కగా ప్రసంగిస్తుండగా స్పీకర్ మైక్ కట్ చేస్తే ఆ అంశం రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది.

అప్పుడు తప్పు ప్రభుత్వానిది, స్పీకర్ ది అవుతుంది. ఆ విధంగా వాళ్ళ తప్పులను జనంలోకి తీసుకువెళ్లాలి తప్ప సభ బయట ఎన్ని ప్రెస్ మీట్ లు పెట్టినా అంతగా ప్రయోజనం ఉండదని అంటున్నారు. ఇప్పటికైనా జగన్ పట్టు విడుపుల ధోరణి ప్రదర్శించి, అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలపై గళ మెత్తాలని పలువురు కోరుకుంటున్నారు. అప్పుడే ఆయన ప్రజల తీర్పును గౌరవించినట్లు అవుతుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించినట్లు ఉంటుంది. ఈయన సభకు వెళ్లాక అక్కడ జగన్ పట్ల అగౌరవంగా ప్రవర్తించినా, తగిన సమయం కేటాయించకున్నా కూటమి ప్రభుత్వం ఈయన పట్ల తప్పుగా ప్రవర్తిస్తోందని జనానికి అర్థం అవుతుంది. ఆ విధంగా కూటం ప్రభుత్వాన్ని రాజకీయంగా కార్నర్ చేయాలి తప్ప బయట ఎన్ని విన్యాసాలు చేసినా వృధా ప్రయాసే అని జగన్ గమనించాలని జనం కోరుకుంటున్నారు.