ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా, తొలి రోజే గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. బీఏసీ సమావేశం అనంతరం అసెంబ్లీ ఎన్ని రోజులు సాగుతుందన్నది స్పష్టతకు వస్తుంది. తాజా రాజకీయ పరిణామాల మధ్య, వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా జగన్ అసెంబ్లీకి హాజరవుతారా? లేదా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఇటీవల ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, వరుసగా 60 పనిదినాలు అసెంబ్లీకి హాజరుకాకపోతే సభ్యత్వం రద్దు అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలకు ముప్పుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ అసెంబ్లీలో హాజరై కనీసం ఒకరోజు మాత్రమే దర్శనం ఇచ్చి, ఈ అనర్హత ముప్పు నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఒకవేళ హాజరు లేకపోతే, స్పీకర్ ఆ ప్రకటనను అమలు చేసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి, ఈ అసెంబ్లీ సమావేశాలు వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా జగన్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఇప్పుడు జగన్ హాజరు అవుతారో? లేక మరోసారి అసెంబ్లీని దాటేసి అనర్హత ముప్పును పెంచుకుంటారో చూడాలి. ఏదేమైనా ఇప్పుడు అందరి ఫోకస్ జగన్ పైనే ఉంది.