ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా విషయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. విపక్ష నేత హోదా లేకపోతే సభకు రానని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ఇటీవల పేర్కొనగా, దీనిపై స్పష్టత ఇచ్చారు. కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ప్రతిపక్ష హోదా లభిస్తుందని, అది లేనప్పుడు ఇలాంటి హోదా కోరడం నిరాధారం అని స్పష్టం చేశారు.
జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అసత్య ప్రచారంగా అభివర్ణించిన ఆయన, ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపేలా జగన్ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. సభాపతిని దూషించడం, అసెంబ్లీ వ్యవస్థను అపహాస్యం చేయడం నిబంధనలకు వ్యతిరేకమని అన్నారు. సభా నియమావళిని ఉల్లంఘించేలా జగన్ మాట్లాడుతున్నారని, ఇది తగదని సూచించారు.
అసెంబ్లీలో సభ్యులు నియమాలను గౌరవించాల్సిన అవసరం ఉందని స్పీకర్ అన్నారు. ప్రతిపక్ష హోదా లేనప్పుడు కూడా పార్టీకి మాట్లాడే హక్కు ఉందని, అసెంబ్లీకి రాకుండా ప్రజలను మభ్యపెట్టడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఇదంతా తెలిసే జగన్ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
జగన్ మాట్లాడే విధానం పూర్తిగా ప్రేలాపనలా మారిందని, ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపేక్షిస్తున్నామని స్పీకర్ తెలిపారు. భవిష్యత్తులో సభా నియమాలను గౌరవించని వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.