జగన్‌కి చిరంజీవి విషెస్‌: టీడీపీకి కాలుతోందక్కడ.!

Chiranjeevi wishes Jagan Mohan Reddy 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి, సినీ నటుడు చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా చిరంజీవి స్పందించడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగానే కనిపిస్తోంది. సినీ పరిశ్రమ నుంచి మహేష్‌బాబు, నిఖిల్‌ సిద్దార్ధ.. ఇలా పలువురు ప్రముఖులు వైఎస్‌ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షల్ని సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. అయితే, ఇది తెలుగుదేశం పార్టీకి ‘ఎక్కడో కాలేలా’ చేస్తోంది. దాంతో, ‘ఫేక్‌ సీఎం’ అంటూ ఓ చెత్త హ్యాష్‌ ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తెచ్చారు తెలుగు తమ్ముళ్ళు. ఈ క్రమంలో కొందరు ‘పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల’ పేరుతోనూ ట్వీట్లేస్తున్నారు.. వైఎస్‌ జగన్‌ని వెటకారం చేస్తూ.

Chiranjeevi wishes Jagan Mohan Reddy 
Chiranjeevi wishes Jagan Mohan Reddy

సోషల్‌ మీడియాలో ఇదొక కొత్త పైత్యం. పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఇటు టీడీపీ, అటు వైసీపీ శ్రేణులు ఇలాగే చేశాయి. ఆ సంగతి పక్కన పెడితే, వైఎస్‌ జగన్‌కి చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడాన్ని టీడీపీ అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. ‘ఎంతకు అమ్ముడు పోయావ్‌.?’ అని ప్రశ్నించేస్తున్నారు పచ్చ నెటిజన్లు. ఇదెక్కడి పైత్యం. గతంలో చంద్రబాబు, వైఎస్‌ జగన్‌కి పుట్టినరోజు చెప్పిన సందర్భాలున్నాయి. అప్పుడు చంద్రబాబు అమ్ముడుపోయారని అనుకోవాలా.? రాజకీయ వైరం వున్నా, వైసీపీ అధినేతకు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. రాజకీయాలు వేరు. ఓ ముఖ్యమంత్రికి, ప్రధాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల్ని చెబితే, పచ్చ నెటిజన్లకు వచ్చిన సమస్య ఏంటో. ఇక, చిరంజీవి విషయానికొస్తే, వ్యక్తిగత హోదాలో చిరంజీవి, మూడు రాజధానులకు మద్దతిచ్చారు. దాన్ని సైతం అప్పట్లో తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోయింది. నిజానికి, చంద్రబాబుతోనూ చిరంజీవికి సన్నిహిత సంబంధాలున్నాయి.. అలాగే చంద్రబాబుతో గతంలో రాజకీయ వైరం వుండేది కూడా. చిరంజీవిని విమర్శించే క్రమంలో టీడీపీ, వైసీపీ ఒకే ధోరణిని అవలంభిస్తుంటాయన్నది జగమెరిగిన సత్యం. ఇదిలా వుంటే, కొందరు పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు కూడా, వైఎస్‌ జగన్‌కి చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వైఖరి నూటికి నూరు శాతం అవాంఛనీయమే.