వారాహి యాత్రలో చంద్రబాబు – పవన్ కళ్యాణ్ భేటీ.?

ఈ నెల 14వ తేదీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘వారాహి’ యాత్ర ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. ‘వారాహి’ వాహనం ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న తొలి ‘పూర్తి స్థాయి’ రాజకీయ యాత్ర ఇది.

తూర్పు గోదావరి జిల్లా అంటే, జనసేనకు బాగా పట్టున్న ప్రాంతం. దానిక్కారణం, కాపు సామాజిక వర్గం ఇక్కడ బలంగా వుండడమే. తూర్పుతోపాటు పశ్చిమగోదావరి జిల్లా కూడా అంతే. ఈ రెండు జిల్లాల్నీ ప్రస్తుతానికి జనసేన పూర్తిస్థాయిలో టార్గెట్ చేసింది.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, జనసేనాని వారాహి యాత్రలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. వారామి యాత్రలో భాగంగా జనసేన నిర్వహించే ఓ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది.

బహిరంగ సభలో పాల్గొనడమా.? లేదంటే, సంఘీభావం తెలిపేలా.. ఏదో ఒక చోట వారాహిలో పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు భేటీ అవడమా.? అన్నదానిపై ముందు ముందు స్పష్టత రాబోతోంది.

అయితే, జనసేనతో పొత్తు వద్దంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా నినదిస్తున్నాయి. చంద్రబాబు – పవన్ కళ్యాణ్ మధ్య రాజకీయంగా సఖ్యత కనిపిస్తున్నా, ఇరు పార్టీల శ్రేణుల మధ్య కాస్తయినా అవగాహన కన్పించడంలేదు.

ఇదిలా వుంటే జనసేన – టీడీపీ మధ్య నడుస్తున్న పొత్తుల రాజకీయంపై జనసేన మిత్రపక్షం బీజేపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.