2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన తర్వాత ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రతి ప్రతికూల పరిస్థితికి తలవంచాల్సిన గత్యంతరం దాపురించింది ఆయనకు. అటు బలమైన అధికార పార్టీని ఢీ కొట్టలేక ఇటు స్నేహ హస్తం అందించే రాజకీయ పార్టీ లేక టీడీపీ విలవిలాడిపోతోంది. ఈ విపత్కర పరిస్థితులను తట్టుకోవడానికి చంద్రబాబు చేసిన పనుల్లో తన పార్టీ రాజ్యసభ ఎంపీలను భారతీయ జనతా పార్టీలోకి వెళ్లడానికి అనుమతించడం. బాబుగారు ఈ స్టెప్ తీసుకోవడానికి చాలా బలమైన కారణమే ఉంది. వైఎస్ జగన్ అధికారంలో కూర్చుంటే తనకు, తన పార్టీకి పెను ముప్పు తప్పదని చంద్రబాబుకు బాగా తెలుసు. ఆ ముప్పు నుండి తప్పించుకోవాలంటే వెనుక ఏదో ఒక బలం ఉండాలి.
అందుకే బీజేపీ కేంద్ర నాయకత్వం అనుగ్రహం కోసం తన రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు బీజేపీలోకి వెళతామంటే మారు మాట్లాడకుండా ఒప్పుకున్నారు. వారంతా బీజేపీలో ఉండి తనకు సహాయం చేస్తారని బాబుగారు భావించారు. పార్టీ మారే సమయంలో రాజ్యసభ సభ్యులంతా చంద్రబాబుకు మాటిచ్చారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున గుసగుసలు వినబడ్డాయి. అధికార వైసీపీ కూడా అనేకసార్లు పార్టీ మారిన రాజ్యసభ సభ్యులంతా చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటానికే బీజేపీ గూటికి చేరారని, ఇప్పటికీ వారంతా బాబు కనుసన్నల్లో నడుస్తున్నారని ఆరోపిస్తుంటారు.
మొన్నామధ్యన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఓ హోటల్లో సుజనా చౌదరితో సమావేశమయ్యారనే వార్తలు రాగానే ఆ వ్యవహారం నడిపింది చంద్రబాబేనని, తన మనిషైన నిమ్మగడ్డను తిరిగి ఈసీ పదవిలో కూర్చోబెట్టడం కోసం సుజనా చౌదరి వారదిగా బీజేపీతో మంతనాలు జరుపుతున్నారని పెద్ద రగడ చేశారు. వైసీపీ అనుకూల ఛానల్ అయితే వీడియోలతో మూడు నాలుగు రోజులు రచ్చ రచ్చ చేసింది. కానీ వాస్తవంగా చూస్తే టీడీపీ నుండి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ ఎంపీలు ఎవరూ ఇప్పటివరకు చంద్రబాబుకు ఒరగబెట్టినదేమీ లేదు. ఏ ఒక్క విషయంలోనూ టీడీపీకి లేదా చంద్రబాబుకు సహకరించిన దాఖలాలు లేవు. కనీసం టీడీపీ నేతలు వరుసగా అరెస్టవుతున్నా వాటిని ఖడించలేదు. భాజపా అగ్ర నాయకత్వం నుండి తెలుగుదేశం పార్టీకి అనుకూల సంకేతాలేవీ తీసుకురాలేదు.
Read More : మధ్యప్రదేశ్ గవర్నర్ కన్నుమూత
దీన్నిబట్టి వారెవరూ బాబు కోసం పనిచేయడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. మరి వారిని బీజేపీలోకి పంపిన చంద్రబాబు వ్యూహం సంగతేమిటి అంటే అది గల్లంతైందనే అనుకోవాలి. వెళ్లేటప్పుడు తాము చూసుకుంటామని చెప్పిన రాజ్యసభ సభ్యులు స్వీయరక్షణ కోసమే వెళ్లారు తప్ప బాబుగారి కోసం కాదు. అసలు ఓ నలుగురు ఎంపీల కోసం భాజపా అగ్రనాయకత్వం టీడీపీతో కాంప్రమైజ్ అవుతుందా అంటే కాదనే చెప్పాలి. అసలు అలాంటి అవసరం కూడా వారికి లేదు. కనీసం వారి మూలాన ఏపీలో ఏదో ఒక మూల ఓటు బ్యాంకు ఏర్పడే అవకాశమైనా ఉంటే భాజపా ఏమైనా స్పందించేదేమో కానీ ఆ ఆస్కారం లేకపోవడంతో వారి మాటకు అధిష్టానం వద్ద పెద్దగా విలువేమీ లేదు. వచ్చే దఫాలో పార్టీ మారి వచ్చిన వీరందరినీ మరోసారి రాజ్యసభకు పంపుతారనే గ్యారెంటీ కూడా లేదు.
Read More : విశాఖ రాజధానిపై చంద్రబాబు కుట్ర భగ్నం!
మరిప్పుడు వారు బీజేపీలో ఉండి చేస్తున్న పనేమిటి అంటే సొంత ప్రయోజనాలు చూసుకోవడమే. సుజనా చౌదరి, సిఎం రమేష్ లాంటి వారికి భారీ స్థాయిలో వ్యాపారాలున్నాయి. వాటన్నిటినీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా కాపాడుకోవాలన్నా, విస్తరించుకోవాలన్నా పెద్దల అండ తప్పనిసరి. అందుకోసమే వారు పార్టీ మారారు. అంతేకానీ రహస్యంగా బీజేపీని బాబుకు సహకారం అందించేలా చేయడానికి కాదు. ఒకవేళ చేయాలనుకున్నా అది సాధ్యం కాని పని. మరి బాబుగారికి ఇవన్నీ తెలియని రాజకీయాల అంటే తెలిసినవే. కానీ వ్యూహం ఫలిస్తే బాగుంటుందని ఎక్కడో చిన్న ఆశ. కానీ ఆ ఆశ కూడా తీరలేదు. నమ్మి పంపిన రాజ్యసభ సభ్యులంతా హ్యాండ్ ఇచ్చేశారు.