ఆంధ్రుల హక్కుగా, నలభై ప్రాణాలు బలైన తరువాత, కోట్లాదిమంది ప్రజలు రోడ్లమీద ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేట్ పరం చేయడాన్ని తప్పు పడుతూ మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించి చంద్రబాబు తనను మించిన హాస్యరచయిత లేడని మరోసారి నిరూపించుకున్నారు. శాకాహార ప్రాశస్త్యాన్ని తోడేలు గోవులకు బోధించిన రీతిలో ప్రభుత్వరంగంలోని ఒక పెద్ద సంస్థను అమ్మేయడం దారుణం అంటూ ఆర్తనాదాలు చేస్తూ గురివింద సామెతను గుర్తుకు తెస్తున్నారు.
ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మిన చంద్రబాబు
ప్రజల జ్ఞాపకశక్తి మీద చంద్రబాబుకు చాల చిన్నచూపు మరి! ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రభుత్వ రంగంలోని షుగర్ కర్మాగారాలను, ఆల్విన్, HMT లాంటి అనేక ప్రభుత్వ సంస్థలను నిర్దాక్షిణ్యంగా నామమాత్రానికి అమ్మేశారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ రంగ సంస్థలు రిపబ్లిక్ ఫోర్జ్, ఐడిపిఎల్, ఈసీఐఎల్ లాంటి అనేక సంస్థలు మూతపడిపోయి ప్రయివేట్ వారికి లాకులు ఎత్తేశాయి. ప్రయివేట్ సంస్థలు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టి విశాలమైన ఇంద్రభవనాలు, నందనవనాలను తలదంతూ వ్యాపారసంస్థలు నిర్మించడం అప్పట్లో అనేకమందికి ఉపాధి అవకాశాలు కల్పించడం వాస్తవమే అయినప్పటికీ ప్రాణావసరాల కోసం వినియోగించే మందుల ధరలు అప్పటికీ ఇప్పటికీ వందల రెట్లు పెరిగాయి. ఇక చంద్రబాబు తన ఇంటి సంస్థ హెరిటేజ్ కోసం ప్రభుత్వ సంస్థ విజయ డైరీ, చిత్తూరు డైరీల ఉసురు తీసేశారు.
అలాంటి చంద్రబాబు నేడు విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ చేస్తున్నారని బోలెడంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కును అమ్ముతున్నది కేంద్రప్రభుత్వం అయితే, దాన్ని జగన్మోహన్ రెడ్డి అమ్మేస్తున్నట్లు గగ్గోలు పెడుతున్నారు తప్ప మోడీని పన్నెత్తి మాట అనడానికి సాహసించడం లేదు. విశాఖను తుక్కుగా అమ్మేసి జగన్ ఏదో లక్షల కోట్లు కాజేస్తున్నట్లు ఆయన, ఆయన ముఠానాయకులు, ఆయనకు భజనలు చేసే క్షుద్రమీడియా శివాలెత్తిపోతున్నది. ఇదే సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రభుత్వ నిర్ణయాన్ని తెగ పొగిడేసి మోదీ సాక్షాత్తూ భగవంతుడు అని స్తోత్రాలు చేసేవాడు.
రాజీనామా డ్రామాలు
గత కొద్దికాలంగా పనీపాటాలేని కొందరు శాలువా మేధావులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం మండువేసవిలో మజ్జిగ గ్లాసు దొరికినంత ఆనందమా ఉన్నది. ఎక్కడా పుట్టని ఉద్యమాలను కూడా పుట్టించేసి తమకు తామే నాయకులుగా ప్రకటించుకుని విశాఖ సముద్రతీరాన కెమెరావారు చిత్రీకరిస్తుండగా గుమ్మడి, జగ్గయ్యలకన్నా మిన్నగా హావభావాలను పలికిస్తూ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. మరికొందరు షామియానాలు వేసుకుని ఆమరణ నిరాహారదీక్షలు పేరుతో రకరకాల డ్రామాలను పండిస్తారు. తెలుగుదేశం శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు రాజీనామా డ్రామాను ప్రారంభించారు. అయితే రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ఆయనకు రాజీనామా ఎలా ఇవ్వాలో కూడా తెలియదని ఆ తరువాత ఆయనకే తెలిసింది. గంట చెయ్యగానే మిగిలిన వారిమీద ఒత్తిడి పెరుగుతుందట. అసలు గంటా రాజీనామాయే ఇవ్వలేదు..అప్పుడే ఆయనను ఒక త్యాగమూర్తిగా పచ్చమీడియా ప్రాజెక్ట్ చెయ్యడం మొదలెట్టింది. గంటా శ్రీనివాసరావు ఏనాటినుంచో తెలుగుదేశం పార్టీ నుంచి బయటపడాలని, అందుకు తగిన కారణాలకోసం తీవ్ర అన్వేషణ సాగిస్తున్నారని అందరికీ తెలుసు. ఇప్పుడు విశాఖ ఉక్కు ఒక సాకుగా దొరికింది. అయినప్పటికీ ఆయన రాజీనామా చెయ్యరనేది సూర్యుడు తూరుపుదిక్కున పొడుస్తాడన్నంత పరమసత్యం.
తెలుగుదేశం మొత్తం రాజీనామా చెయ్యాలి
చంద్రబాబు తన మహోద్యమాన్ని ప్రారంభించే ముందు మోదీ నిర్ణయానికి నిరసనగా తనతో సహా తన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చెయ్యాలి. అలాగే ఎమ్మెల్సీ, ఎంపీలు కూడా రాజీనామా చెయ్యాలి. విశాఖ టౌన్ లో నలుగురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని రావాలంటే ముందుగా విశాఖకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఆ తరువాత శ్రీకాకుళం విజయనగరం లోని ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తే మోదీగారికి ఆ సెగ తప్పకుండా తగిలి తీరుతుంది. అలాగే అమరావతి ఉద్యమాన్ని అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లి ప్రపంచంలోనే అనేక దేశాల్లో ఉద్యమం జరిగేట్లుగా కృషి చేసిన చంద్రబాబు “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” ఉద్యమానికి నాయకత్వం వహించాలి. ఉద్యమం కోసం అవసరమైతే విదేశాల్లో కూడా దాచుకున్న తన లక్షలకోట్ల సంపదను ధారపోయాలి. మోదీ చెరనుంచి విశాఖ ఉక్కును విడిపించే బాధ్యత చంద్రబాబుదే.
చంద్రబాబు ప్రవచించినట్లు ఆనాటి విశాఖ ఉక్కు ఉద్యమంలో పాలుపంచుకున్న వెంకయ్యనాయుడుతో కూడా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయించి ఆయన అనుభవాన్ని కూడా కలుపుకుని ఇంద్రాది దేవతలే ఇరుకునబడి అదిరిపోయేట్లుగా, చంద్రబాబు గారి ఉద్యమసెగలకు భయపడి సూర్యచంద్రులు కూడా తమ తమ ఇళ్లలో ఏసీలు పెట్టించుకునేవిధంగా ఉక్కు ఉద్యమాన్ని నిర్మిస్తారని, నలభైవేలమంది ఉద్యోగాలను నిలబడతారని ఆశిద్దాం.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు
Chandrababu is the one who says if the listener is crazy