చంద్రబాబు డ్రామాలు పండటం లేదు

Chandrababu is not reaping dramas
ఎందుకో తెలియదు…చంద్రబాబు హఠాత్తుగా రైతుజనబాంధవుడు అయ్యాడు.  రైతుల కంట కనీరు కనిపిస్తే చాలు చంద్రబాబు గారి నవనీతహృదయం కరిగి నీరైపోతున్నది.  సమయానుకూలంగా ఆయన పరమభక్తుడై పోతారు.  కొత్తగా మతం పుచ్చుకున్నవాడికి నామాలు ఎక్కువ అన్నట్లు ఆయన ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న మోడీ, అమిత్ షాలకు కూడా కనిపించే విధంగా రెండు రూపాయల బిళ్ళ సైజులో తిలకం, కస్తూరి, చందన కుంకుమలు ధరిస్తారు.  ఇక బీసీలను, ఎస్సీలను చూస్తే ఆయన వారిని ఉద్ధరించడం కోసమే అవతరించినట్లు బిల్డప్పులు ఇస్తారు.  నిరుద్యోగుల బాధలను చూసి వలవల విలపిస్తారు.    పింఛన్ రాని అవ్వలను, తాతలను చూడగానే చంద్రబాబుగారి గుండె క్షోభిస్తుంది.   పిల్లలు అందరూ తెలుగులోనే చదివి మాతృభాషను బ్రతికించాలని ఎలుగెత్తుతారు.     తన పదునాలుగేళ్ల ముఖ్యమంత్రిత్వంలో ఏనాడూ స్థానిక సంస్థల ఎన్నికలు జరపకుండా ప్రత్యేకాధికారుల పాలనతో పెత్తనం చెలాయించిన ఆయన ఉన్నట్లుండి గ్రామస్వరాజ్యం కోసం కలలు కంటూ గాంధీమహాత్ముడి అవతారం ఎత్తుతారు!   తన హయాంలో ఎప్పుడో మూడేళ్ళ క్రితం జరపాల్సిన పంచాయితీ ఎన్నికలను జరపడానికి భయపడి అధికారం పోయాక ఇప్పుడు ప్రజాస్వామ్యం హత్యగావించబడుతున్నది అంటూ గొంతు పైకెత్తి భోరున విలపిస్తారు.  ఇదంతా ఆయన ప్రతిపక్షంలో ఉన్నపుడు చేసే విన్యాసాలు సుమా!     అధికారం చేతిలో ఉంటె మాత్రం ఆయనకు వీటిలో ఒక్కటి కూడా గుర్తుండదు.      ఆయన అదృష్టం ఏమిటంటే, ఆయన ఏమి మాట్లాడినా దాన్ని అందంగా చిత్రిస్తూ బాకాలూదే పత్రికలు, ఛానెల్స్ ఆయన బానిసల్లా ఇంటి కాంపౌండ్ లో కట్టేయబడి ఉంటాయి!    
 
Chandrababu is not reaping dramas
Chandrababu is not reaping dramas
 ఇక రైతులంటే గుర్తొచ్చేది ప్రపంచంలో చంద్రబాబు ఒక్కరే.     అలుపెరుగని రైతు పక్షపాతి, కృషీవలరత్న బిరుదాంకితులు,  భూమాత గుండెల్లో నాగళ్లు గుచ్చి సిరులపంటలు పండించే  హలధారి,  రైతులకోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడి వారి హృదయాల్లో ప్రేమగా నాలుగు తూటాలు దింపి రంభ ఊర్వశి మేనక తిలోత్తమాది  అప్సరో శిరోమణుల దివ్యసుందర నృత్యగానాదులను విని కని తరించమని ముగ్గురు రైతులను అమరపురికి ఉచితంగా  పంపి,   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగానే  రైతుల రుణాలను మొత్తం మాఫీ చేసేసి, వారి బంగారాన్ని బ్యాంకులనుంచి ఇళ్లకు రప్పించిన రేటు బాంధవుడు  శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు జగన్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా  తెచ్చిన అయిదు జీవోలను భోగిమంటల్లో వేసేశారట! 
 
రైతులంటే ఇంత వాత్సల్యం కలిగిన నాయకుడిని మనం ఎన్నడైనా చూశామా?   
 
ఓకే.  చంద్రబాబు గారి రైతు ప్రేమను అంగీకరిద్దాము.  ఢిల్లీ మహానగరంలో రెండు నెలలనుంచి పంజాబ్, హర్యానాకు చెందిన లక్షలాదిమంది రైతులు ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకం అంటూ చలి, మంచును, ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్యకుండా ప్రాణాలకు తెగించి దీక్షలు చేస్తున్నారు.  కరోనా భయాన్ని కూడా విస్మరించి రోడ్డు మీదనే పడుకుంటున్నారు.  రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చెయ్యాల్సిందే అని నినదిస్తున్నారు.  సుప్రీమ్ కోర్ట్ ఒక మధ్యేమార్గాన్ని సూచించినా, చట్టాలను రద్దు చేస్తేనే కానీ ఉద్యమాన్ని విరమించబోమని దీక్షలు చేస్తున్నారు.  
 
మరి రైతు ప్రేమికుడు చంద్రబాబు ఒక్కసారైనా ఢిల్లీ వెళ్లి ఆ రైతులను పరామర్శించారా? పోనీ హైద్రాబాద్ లోని తన మూడువందల యాభై కోట్ల మహారాజభవనంనుంచి జూమ్ యాప్ ద్వారానైనా రైతులకు తమ మద్దతును ప్రకటించారా?  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక జీవోలను భోగిమంటల్లో పడేసిన చంద్రబాబు మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను కూడా ఆ భోగిమంటల్లో పడేసే సాహసం చేస్తారా?  చంద్రబాబుకు రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, తక్షణమే ఆయన మోడీ తెచ్చిన చట్టాలను తీవ్రంగా విమర్శించి వాటి కాపీలను భోగిమంటల్లో తగలేసి రైతుల కళ్ళలో ఆనందాన్ని చూడాలి.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు